మిన్నంటిన సంబరాలు..
బుధవారం రాత్రి నుంచే ఆరాధనల్లో క్రైస్తవ సోదరులు లీనమయ్యారు. శాంతాక్లాజ్‌ల వేషధారణతో యువత పట్టణం అంతా ఊరేగింపుగా తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు, ఆట బొమ్మలను అందించారు. ఇక క్రైస్తవ ఆలయాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించి, మిలమిల మెరిసే స్టార్‌లను ఏర్పాటు చేసి చర్చిలకు కొత్త అందం తీసుకొచ్చారు. క్రైస్తవ సోదరులు తమ గృహాలపై, ముందు భాగంలో వివిధ ఆకృతులతో కూడిన స్టార్‌లను పదిరోజుల ముందే ఏర్పాటు చేసి క్రిస్మస్ సంబరాలకు ఆహ్వానం పలికారు. ఇక పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలతో పాటూ పిండివంటలను చేసుకుని ఇరుగు పొరుగుకు పంచి పెట్టేందుకు క్రైస్తవ సోదరులు సిద్ధమయ్యారు. అలాగే చైన్నె నగరంలోని పలు ప్రసిద్ధి చెందిన క్రైస్తవాలయాలు ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో కేక్‌ను కట్ చేసి ఏసు క్రీస్తు జన్మదిన ఆహ్వానం, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉదయం జరిగే ప్రత్యేక ప్రార్థనలకు చైన్నె శాంథోమ్, సెయింట్ థామస్ మౌంట్, బీసెంట్ నగర్, లిటిల్ మౌంట్ చర్చీ, ప్యారీస్ ఆంథోనియార్, కేకే నగర్ మత్తయి చర్చి, మైలాపూర్‌లోని లజ్ చర్చ్, ఎగ్మూర్ వెస్లీ చర్చి, వేప్పేరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చి, పెరంబూరు వాటర్ బరి బాప్టిస్ట్ చర్చి తదితర ప్రముఖ క్రైస్తవాలయాలు సిద్ధమయ్యాయి. క్రిస్మస్ షాఫింగ్ నిమిత్తం క్రైస్తవ సోదరులు తరలి రావడంతో చైన్నె, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, విరుదునగర్ తదితర జిల్లాల్లోని వాణిజ్య కేంద్రాలు కిక్కిరిశాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఈ ఏడాది వరదలు ముంచెత్తినా, తమ ఆరాద్య దైవాన్ని ప్రార్థిచుకునేందుకు అక్కడి ప్రజలు సిద్ధమయ్యారు. ఇక చైన్నె టీ నగర్, ప్యారీస్, పురసైవాక్కం పరిసరాల్లో షాపింగ్ సందడి మిన్నంటాయి. ఈసారి పండుగ నిమిత్తం స్వస్థలాలకు, స్వగ్రామాలకు చేరుకున్న వాళ్లు ఎక్కువే. వీరికోసం ప్రత్యేక బస్సులు,రైళ్లు నడిపారు. ఇక, నాగపట్నం జిల్లా వేలాంకన్నిలో క్రిస్మస్ సంబరాలుమిన్నంటనున్నాయి. ఇక్కడ 43 అడుగులతో కూడిన బ్రహ్మాండ క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక్కడ వేలాదిగా భక్తులు తరలి వచ్చి ప్రార్థనలలో లీనం కానున్నారు. ఇక బుధవారం షాపింగ్ సందడి నెలకొంది. కొత్త బట్టలు, పండుగ కోసం అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లు జోరుగా జరిగాయి. కాగా క్రిస్మస్ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతాపరంగా చర్యలు విస్తృతంగా చేశారు. అన్ని చర్చిల వద్ద భద్రత, ఆ పరిసర మార్గాలలో ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చైన్నెలో 8 వేల మందితో భద్రతా చర్యలకు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. చైన్నెలోని మైలాపూర్ శాంతోమ్, బీసెంట్ నగర్ వేలంకన్నీ, సెయింట్ అంథోని, అన్నాసాలై సెయింట్‌జార్జ్, సైదాపేట చిన్నమలై తదితర చర్చీల పరిసరాలలో భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.


