అధికారమే లక్ష్యంగా శ్రమిద్దాం!
సాక్షి, చైన్నె: సినీ నటుడిగా, విప్లవ నాయకుడిగా, తమిళుల ఆరాధ్యుడిగా, అందరివాడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న భారత రత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ వర్ధంతి సభలను అన్నాడీఎంకే వర్గాలు బుధవారం ఘనంగా జరుపుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఆయన విగ్రహానికి, చిత్ర పటాలకు ఘన నివాళులర్పించాయి. దివంగత నేతల ఆశయ సాధనలో, వారు సూచించిన మార్గంలో నడుద్దామని, అసెంబ్లీ ఎన్నికలలో అవిశ్రాంతంగా శ్రమించి అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా ప్రతిజ్ఞ చేశారు. వివరాలు.. ఎంజీ రామచంద్రన్ భౌతికంగా అందరినీ వీడి బుధవారంతో 38 సంవత్సరాలు అయ్యింది. డిసెంబరు నెలలోనే అన్నాడీఎంకే పురట్చి తలైవర్, పురట్చి తలైవీ అయిన ఎంజీఆర్, జె. జయలలిత దివంగతులు కావడంతో వారిని స్మరిస్తూ ఈనెల పొడవున అన్నాడీఎంకే వర్గాలు కార్యక్రమాలు నిర్విహించడం ఆనవాయితీ. బుధవారం ఎంజీఆర్ వర్ధంతి కావడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో పెద్దఎత్తున కార్యక్రమాలు జరిగాయి. ఎంజీఆర్ చిత్ర పటాలను అన్నాడీఎంకే వర్గాలు కొలువుదీర్చి పుష్పాంజలి ఘటించాయి. ఆయన విగ్రహాలకు నిలువెత్తు పూవ్వుల మాలలు వేశారు. అలాగే ఎంజీఆర్ చిత్ర పటాల పక్కనే అమ్మ జయలలిత చిత్ర పటాల్ని సైతం అనేక చోట్ల ఉంచి నివాళులర్పించుకున్నారు. మౌన ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు, సేవా కార్యక్రమాలు సాగాయి.
నల్లచొక్కాలు ధరించి..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు నల్ల చొక్కాలు ధరించి ర్యాలీగా ఉదయాన్నే మెరీనా తీరంలోని సమాధి వద్దకు వచ్చారు. ఎంజీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు కేపీ మునుస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, తంబిదురై, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, సెల్లూరు రాజు, కామరాజ్, పొల్లాచ్చి వి. జయరామన్, జయకుమార్, మహిళా నేతలు వలర్మతి, గోకుల ఇందిర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంజీఆర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఆశయ సాధనే లక్ష్యం అని, వారూ చూపించిన మార్గంలో పయనిద్దామని అందరితో పళణి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా తీర్మానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం లక్ష్యంగా అవిశ్రాంతంగా శ్రమిద్దామని, పళణి స్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ద్రోహులు, శతృవుల వ్యూహాలను రెండు కోట్లకు పైగా ఉన్న అన్నాడీఎంకే సైన్యాన్ని ఉపయోగించి భగ్నం చేద్దామని, గెలుపు లక్ష్యంగా ముందుకెళ్దామని పళణి స్వామి పిలుపు నిచ్చారు. అనంతరం మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం వర్గాలు సైతం సమాధి వద్దకు తరలి వచ్చి అంజలి ఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జయలలిత నెచ్చెలి శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌లు వేర్వేరుగా ఎంజీఆర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
అధికారమే లక్ష్యంగా శ్రమిద్దాం!


