సెమ్మోళి పార్కు అంకితం
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు గాంధిపురం కేంద్ర కారాగారం పరిధిలోని 165 ఎకరాల విస్తీర్ణంలో సెమ్మోళి పార్కును ఏర్పాటు చేయడానికి 2010లో డీఎంకే వర్గాలు నిర్ణయించినా, అది తాజాగా కార్యరూపంలోకి వచ్చింది. 2021లో అధికారంలోకి వచ్చినానంతరం సీఎం స్టాలిన్ ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోయంబత్తూరు వాసుల కోసం గాంధీపురం 165 ఎకరాలలో బ్రహ్మాండ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో తొలి విడతగా 45 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలు, బహిరంగ వేదిక వంటి నిర్మాణాలతో కూడిన పార్కును తాజాగా ఏర్పాటు చేశారు. రూ. 208.50 కోట్లతో ఈ క్లాసికల్ పార్క్‌లో బొటానికల్ గార్డెన్, సోలార్ ప్యానెల్, శిల్పాలు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఉక్కడం మురుగునీటి శుద్ధి కర్మాగారం నుంచి శుద్ధి చేసిన నీటిని పైపుల ద్వారా సరఫరా చేయడం, పార్కు ఆవరణలో అండర్ గ్రౌండ్, పార్కింగ్, భూగర్భ నీటి ట్యాంక్, వర్షపు నీటి పారుదల, విద్యుత్ తదితర అన్ని రకాల పనులను తాజాగా ముగించారు. ప్రపంచ స్థాయి శాసీ్త్రయ సంగీత పాఠశాలగా ఈ ఉద్యాన వనాన్ని తీర్చిదిద్దారు. దీనిని కోయంబత్తూరు ప్రజల వినియోగానికి తాజాగా తీసుకొచ్చారు.
ప్రజలకు అంకితం..
కోయంబత్తూరు వాసులకే కాదు, ఇక్కడకు వచ్చే కొంగుమండలంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా రూపుదిద్దుకున్న ఈ పార్కును సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దివ్యాంగులు, పిల్లకు ఆట స్థలం, పార్కులో వివిధ రకాల మొక్కలు, చెట్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదతర వాటిని సీఎం స్టాలిన్ బ్యాటరీ వాహనంలో వెళ్లి వీక్షించారు. అలాగే పార్కులో ఒక మొక్క నాటారు. ఈ ప్రపంచ స్థాయి ఉద్యానవనంలో సాంప్రదాయ అడవులు, మూలికళ తోట, పుప్పొడి తోట, సువాసనగల లిల్లీ తోట, ఎడారి తోట, పూల తోట, వెదురు తోట, నక్షత్ర తోట అంటూ 23 రకాల తోటలు, గులాబీ తోటలతో తీర్చిదిద్దారు. సంఘ కాల సాహిత్యంలో ప్రస్తావించబడిన చెట్లు, మొక్కలను కూడా ఇక్కడ నాటారు. గులాబీ తోటలో 2000 కంటే ఎక్కువ రకాల గులాబీలు ఉన్నాయి. ఈ పార్క్ కాంప్లెక్స్‌లో ఒక పుడ్ కోట్‌తో పాటూ పాలరాతి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. క్లాసికల్ పార్క్ కాంప్లెక్స్‌లో టికెట్ కౌంటర్‌తో పాటుగా 500 మంది కూర్చునేందుకు వీలుగా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక గది రెస్టారెంట్, అవుట్ లెట్ , కృత్రిమ జలపాతం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉన్నాయి. ఇక, 453 కార్లు, 10 బస్సులు, 1000 ద్విచక్ర వాహనాలను ఆపేందుకు పార్కింగ్ స్థలం సిద్ధంచేసి ఉంచారు.ఈ క్లాసికల్ పార్క్ కాంప్లెక్స్ లోపల జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులు చదువుకునేందుకు వీలుగా ప్రత్యేక అధ్యయన మందిరం, ప్రయాణానికి వీలుగా వీల్ చైర్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు సిద్ధంచేశారు. ఈ పార్కును ప్రారంభించినానంతరం ఎక్స్ పేజీలో సీఎం స్టాలిన్ స్పందిస్తూ, అధినేత, తన తండ్రి కలైంజ్ఞర్ 2010లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశామని వివరించారు. సెమ్మోళి మహానాడు వేదికగా ఈ పార్కు గురించి ఆయన వాగ్దానం చేశారని, తాజాగా కార్యరూపంలోకి తెచ్చామన్నారు. అనంతరం కోయంబత్తూరు జిల్లా, చెట్టిపాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒరట్టుక్కుపై గ్రామంలో అందరికీ ఇళ్లు పథకం కింద జీడీ నాయుడు ఫౌండేషన్ మద్దతుతో రూ. 67 కోట్లతో దివ్యాంగుల కోసం నిర్మించిన 86 గృహాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. లబ్దిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఇక్కడ జరిగిన సాంప్రదాయ కళా ప్రదర్శనలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు,ఎం.పి.స్వామినాథన్, టి.ఆర్.పి. రాజా, కయల్వెలి సెల్వరాజ్, ఎంపీలు గణపతి రాజ్ కుమార్, ఈశ్వరస్వామి పాల్గొన్నారు. కాగా, సాయంత్రం జరిగిన పెట్టుబడి దారుల సదస్సులో రాష్ట్రంలోని అవకాశాలు, ప్రోత్సహకాలను గురించి సీఎం వివరించారు. అలాగే, సీఎం స్టాలిన్ సమక్షంలో రూ. 43,844 కోట్లకు సంబంధించిన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. వివిధ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
నేడు 76వ రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగం 76వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ , స్వయంప్రతిపత్తి సంస్థలు, పాఠశాలలు, కళాశాలలలో భారత రాజ్యాంగ పఠనం జరగాలని సూచించారు. భారత దేశం సంపన్న మార్గంలో నడిపించే ఒక గొప్పసృష్టిగా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేస్తూ, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల శ్రేయస్సు, రక్షణ, తదితర అంశాలను గుర్తించి ఆ ఉత్తర్వులలో వివరించారు. తమిళనాడు ప్రజల ప్రాథమిక హక్కులు , ఐక్యతను కాపాడటం , ఐక్యత, సోదరభావం, మంచిని నిర్ధారించం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక సూత్రాలను అనుసరించడం గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగం ప్రకారం మహిళలు , పిల్లల ప్రాథమిక హక్కులను అమలు చేయడం లక్ష్యం అని వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగాన్ని గౌరవివంచే విధంగా బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో అన్ని విభాగాలలో, హైకోర్టు , జిల్లాల కలెక్టరేట్‌లలోని అన్ని విభాగ ప్రధాన కార్యాలయాలు, సబార్డినేట్ ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలలలో కార్యక్రమాలకు ఆదేశించారు. అలాగే, పాఠశాలలు,కళాశాలలలో విద్యార్థుళకు పోటీలు,సెమినార్లు,క్వీచ్ తదితర కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.


