తలైవాసల్‌లో కూటమి నిర్ణయం
సాక్షి, చైన్నె : తలైవాసల్ వేదికగా జరిగే మహానాడులో కూటమి ప్రకటన చేయడానికి పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు నేతృత్వంలోని పార్టీ వర్గాలు నిర్ణయించారు. పీఎంకేలో విభేదాల గురించి తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు నేతృత్వంలో ఓ శిబిరంగా, ఆయన వారసుడు అన్బుమణి నేతృత్వంలో మరో శిబిరంగా నేతలు చీలి పీఎంకే కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో పీఎంకే ఏ కూటమిలో చేరుతుందన్న చర్చ జరుగుతూ వచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం దిండివనం సమీపంలోని తైలాపుర్ తోటలో జరిగిన పీఎంకే పార్టీ సమావేశంలో కూటమి గురించి చర్చించారు. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు నేతృత్వంలో జరిగిన ఈసమావేశానికి పార్టీగౌరవ అధ్యక్షుడు జీకేమణి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీగాంధీతోపాటూ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఇందులో ఏఏ నియోజకవర్గాలో 2026 ఎన్నికలలో పోటీ చేయాలో అన్న అంశంగా చర్చించారు. ఈ నియోజకవర్గాలలో చేపట్టాల్సిన పనుల గురించి సమీక్షించారు. వన్నియర్ రిజర్వేషన్ సాధన, కులాల వారీగా జనగణనకు పట్టుబడుతూ నిరంతర పోరాటలకు నిర్ణయించారు. అలాగే, డిసెంబరు 30వ తేదిన సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని తలైవాసల్‌లో పార్టీ మహానాడుకు నిర్ణయించారు. ఇందులో ఎవరితో కూటమి అన్నది ప్రకటించే విధంగా తీర్మానించారు. అనంతరం మీడియాతో గౌరవ అధ్యక్షుడు జికేమణి మాట్లాడుతూ, పొత్తుల గురించి తానెవ్వరితోనూ ఇంత వరకు మాట్లాడ లేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని ప్రకటించారు.


