ఓట్లు జాగ్రత్త!
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఓట్లు జాగ్రత్త ...ఏ ఒక్క ఓటు జాబితా నుంచి తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లాల కార్యదర్శులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి హెచ్చరించారు. మంగళవారం రాయపేటలోని పార్టీ కార్యాలయం నుంచి జిల్లాల కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా పళణి స్వామి సమావేశమయ్యారు. వివరాలు.. 2026లో అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయించే విధంగా గత కొద్ది రోజులుగా అన్ని విభాగాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఐటీ విభాగాన్ని బలోపేతం చేస్తూ, సామాజిక మాధ్యమాలలో ప్రచార కార్యక్రమాల విస్తృతానికి చర్యలు చేపట్టారు. అలాగే ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాలలో కమిటీలను ఇప్పటికే రంగంలోకి దించారు. ఈ పనుల ప్రక్రియ, డిసెంబరులో జరగనున్న పార్టీ సర్వ సభ్య సమావేశం గురించి జిల్లాల కార్యదర్శులతో పళణిస్వామి బుధవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పార్టీ పరంగా ఉన్న 82 జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగై నుంచి పళణి స్వామి అందరి నేతలతో జిల్లాల వారీగా మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా సాగుతున్న కార్యక్రమాలు, బూత్ కమిటీల పనితీరు గురించి సమీక్షించారు.
అప్రమత్తత అవశ్యం
ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి పదే పదే అప్రమత్తత అవశ్యమని నేతలకు పళణిస్వామి హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకేకు ప్రత్యేక ఓటు బ్యాంక్ అనేక నియోజకవర్గాలలో ఉన్నాయని, ఇవన్నీ ఓటరు జాబితాలో గల్లంతు కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ ఓటర్ల వద్దకు వెళ్లి, దరఖాస్తులను పూర్తి చేయించి బీఎల్‌ఓలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోగస్ ఓటర్లు, నకిలీ ఓట్లరు గుర్తించి, వారి సమాచారాలను బీఎల్‌ఓల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే అధికార డీఎంకేకు అనుకూలంగా ఎవరైనా బీఎల్‌ఓలు వ్యవహరిస్తుంటే తక్షణం వారి గురించి సమాచారం అందజేయాలని, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలని ఆదేశించారు. అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌కు ఎలాంటి నష్ట కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఈ నియోజకవర్గంలోనైనా పార్టీ నాయకులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటు సమాచారం ఉంటే తక్షణం వారిపై చర్యలు తీసుకునే విధంగా తనకు సమాచారం ఇవ్వాలని పార్టీ జిల్లాల కార్యదర్శులను పళణి స్వామి ఆదేశ/ంచారు. చివరగా డిసెంబర్ 10వ తేదీన చైన్నెలో జరగనున్న పార్టీ సర్వ సభ్య సమావేశం గురించి వివరించారు.


