విజయ్ వైపు సెంగొట్టయ్యన్ చూపు?
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్ తమిళగ వెట్రి కళగంలో చేరబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో సెంగొట్టయ్యన్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా వెలువడ్డ సమాచారం రాజకీయంగా చర్చకు దారి తీశారు. సుమారు 5 దశాబ్దాలకు పైగా అన్నాడీఎంకే రాజకీయాలలో కీలకంగా ఉన్న సీనియర్‌నేత సెంగొట్టయ్యన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఖండించడం వివాదానికి దారి తీసింది. అదే సమయంలో బయటకు వెళ్లిన వాళ్లంతా ఒకే వేదికపైకి వచ్చిన ప్పుడే అన్నాడీఎంకేకు అధికారం అని ఐక్య గళాన్ని అందుకుని పార్టీ నుంచి సెంగొట్టయ్యన్ బహిష్కరణకు గురి అయ్యారు. కొంగు మండం రాజకీయాలలో కీలకంగా ఉన్నసెంగొట్టయ్యన్ తాజాగా తమిళగ వెట్రి కళగం వర్గాలతో సంప్రదింపులో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఎంజీఆర్‌ను సెంగొట్టయ్యన్ అధికంగా ఆరాధిస్తారు. ఆ తదుపరి అమ్మ జయలలితను అభిమానిస్తుంటారు. తాజాగా విజయ్ చర్యలన్నీ ఎంజీఆర్ బాణిలో ఉన్నట్టుగా సెంగొట్టయ్యన్ భావిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాజకీయంగా ఎదుగుతున్న విజయ్‌కు మరింత బలాన్ని కలిగించే విధంగా సెంగొట్టయ్యన్ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రచారం ఊపందుకుంది. గురువారం విజయ్‌తో భేటీ అనంతరం టీవీకేలో సెంగొట్టయ్యన్ చేరనున్నట్టుగా సామాజిక మాధ్యమాలలో తేది, ముహూర్తం తదితర వివరాలు హల్‌చల్ చేస్తుండటం గమనార్హం. అదే సమయంలో విజయ్ వైపుగా సెంగొట్టయ్యన్ వచ్చిన పక్షంలో అన్నాడీఎంకేలో అసంతృప్తులు తమిళగ వెట్రి కళగం వైపుగా అడుగులు వేసే అవకాశాలు ఎక్కువే. అలాగే కొంగు మండలంలో సెంగొట్టయ్యన్ రూపంలో ఓ బలమైన సామాజిక వర్గం బలం విజయ్‌కు మద్దతుగా దక్కినట్టే. అలాగే, అపార రాజకీయం అనుభవం ఉన్న సెంగొట్టయ్యన్ సలహాలు విజయ్‌కు మరింత బలాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువే.


