ఢిల్లీకి నైనార్
యాత్ర వాయిదా
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. తన యాత్రను వాయిదా వేసుకుని మరీ ఆయన అధిష్టానం పెద్దల్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం తేనిలో పర్యటనకు ఏర్పాటు చేసుకున్నారు.అదే సమయంలో ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో ఆ పర్యటనను రద్దు చేసుకోవడమే కాకుండా ఈనెల 30వ తేదీ వరకు తన పర్యటనలన్నీ వాయిదా వేసుకునే దిశగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుటాహుటీన ఆయన ఢిల్లీకి వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేలో తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధం అన్నట్టుగా అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఇచ్చిన సంకేతాల ప్రచారం నేపథ్యంలో ఆ సమాచారాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు నైనార్ వెళ్లినట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో పన్నీరు సెల్వం సైతం కొత్త ప్రయత్నాలలో ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే వర్గాలను ఏకం చేసే దిశగా అధిష్టానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తమిళనాట వ్యూహాలకు పదును పెట్టేందుకే ఈ ఢిల్లీ పర్యటన అని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు.


