
వివాహితతో అసభ్య ప్రవర్తన
–నలుగురి అరెస్టు
తిరువళ్లూరు: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ సత్తరై గ్రామానికి చెందిన రాజ్‌కుమార్. ఇతని భార్య సౌమ్య(24). ఈమె ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. ఈక్రమంలో గత 21వ తేదీన విధులు ముగించుకుని భర్తతో వెళుతున్న సౌమ్యను అడ్డగించి మద్యం మత్తులో వున్న యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన భర్తను చితకబాదారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు సౌమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు జిల్లా మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తును చేశారు. దర్యాప్తులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు సత్తరై గ్రామానికి చెందిన అరుణ్, గోపి, మనోజ్, పేరంబాక్కం గ్రామానికి చెందిన కపిలన్‌గా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.