
తిరుత్తణిలో పెళ్లిళ్ల సందడి
తిరుత్తణి కొండలో పెళ్లిళ్లకు హాజరైన బంధువులు
కల్యాణ వేడుకలు
–ఒకే రోజు 70 వివాహాలు
తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయంలో శుక్రవారం పెళ్లిళ్ల సందడి నెలకొంది. తిరుత్తణి ఆలయంలో ఆవణి నెల తొలి శుభముహూర్తం సందర్భంగా శుక్రవారం సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సన్నధిలో వివాహాలు జరిపేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఆవణి నెల శుభ ముహూర్తం సందర్భంగా 70 పెళ్లిళ్లు జరిగాయి. ఆర్‌సీ, కావడి, వసంత మండపంలో నిర్వహించిన వివాహాలకు పెళ్లి పందరి ఏర్పాటు చేసి పుష్పాలతో అలంకరించారు. వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు శుభముహూర్తం సమయంలో వివాహాలు నిర్వహించారు. ఇందు కోసం వధూవరుల కుటుంబీకులు, బంధువులతో కొండ ఆలయం చేరుకున్నారు. మురుగన్ సన్నధిలో తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల సమక్షంలో నూతన జంటలు ఒక్కటయ్యారు. వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం కొండ ఆలయంలో పోటెత్తడంతో కొండ ఆలయంలో శుక్రవారం ఉదయం సందడి నెలకొని కల్యాణ మంగళ వాయిద్యాలు మార్మోగాయి. వివాహమైన నవ దంపతులు మొదటగా సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. పెళ్లిళ్ల కొండ ఆలయ ఘాట్‌రోడ్డులో వాహనాల బారులు తీరాయి. భారీ సంఖ్యలో వాహనాల కొండకు చేరుకోవడంతో నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. కొండ ఆలయంలో పార్కింగ్ నిండిపోగా వాహనాలు కొండకు క్యూకట్టడంతో వాహన సౌకర్యాలు లేక ఘాట్ట్‌రోడ్డులో స్తంభించాయి. పోలీసులు శ్రమించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు.

తిరుత్తణిలో పెళ్లిళ్ల సందడి