అన్నానగర్: చైన్నెలోని తరమణి లా కాలేజీ విద్యార్థులు వేళచ్చేరి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, నిరసన తెలిపారు. చైన్నెలోని వేళచ్చేరి తరమణి రోడ్డులోని ఒక టీ దుకాణం వద్ద 27వ తేదీ అర్ధరాత్రి కొంతమంది లా కాలేజీ విద్యా ర్థులు గుమిగూడారు. ఆ సమయంలో, పెట్రోలింగ్‌లో ఉన్న వేలచ్చేరి పోలీస్‌స్టేషన్‌కు చెందిన సంపత్ అనే పోలీసు అధికారి, మీరు ఇక్కడ ఎందుకు గుమిగూడారని వారిని అడిగాడు. దీంతో కరికల్వన్ అనే లా కాలేజీ విద్యార్థికి, పోలీసు అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో, వారు ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం ప్రారంభించి గొడవకు దిగారని తెలిసింది. ఈ పరిస్థితిలో గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో తరమణి లా కాలేజీ విద్యార్థులు వేళచ్చేరి పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. హెడ్ కానిస్టేబుల్ సంపత్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తరువాత, సీనియర్ పోలీసు అధికారులు నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిలిచి చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు శాంతి చర్చల తర్వాత లా కాలేజీ విద్యార్థులు నిరసనను విరమించారు.
267 కిలోల బంగారం ఎక్కడ?
కొరుక్కుపేట: 2024 జూన్‌న్‌లో బంగారం అక్రమ రవాణా సంఘటన జరిగింది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో రూ.167 కోట్ల విలువైన 267 కిలోల బంగారాన్ని దుబాయ్ సహా విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేశారని తేలింది. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, కస్టమ్స్ విభాగం ఇంకా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదు. నిందితుడు విదేశాల్లో పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. ఈకేసులో ఒక్క గ్రాము బంగారం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఏడాది అవుతున్నా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.
బీజేపీ నిర్వాహకుడి హత్య
తిరువొత్తియూరు: శివగంగైలో గురువారం రాత్రి మద్యం తాగుతున్న సమయంలో జరిగిన గొడవలో బీజేపీ నిర్వాహకుడిని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శివగంగైలోని మజిత్‌రోడ్ ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ (51) బీజేపీ వ్యాపార విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన శివగంగైలోని వారపు సంతలో ద్విచక్ర వాహనాల మెకానిక్ షాపు నడుపుతున్నారు. ఈ క్రమంలో, గురువారం రాత్రి మెకానిక్ షాపులోని విడిభాగాల గోదాములో సతీష్ కుమార్, షాపు ఉద్యోగి మణిభారతి పక్కగదిలో నివసిస్తున్న మరో ఐదుగురు కలిసి మద్యం సేవించారు. అప్పుడు సతీష్ కుమార్ ఆ ఐదుగురి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం జరిగి, ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఐదుగురు కలిసి సతీష్ కుమార్‌పై దాడి చేయగా, ఆయన కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో మణిభారతి కూడా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు సతీష్ కుమార్, మణిభారతిని చికిత్స నిమిత్తం శివగంగై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సతీష్ కుమార్‌ను పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మరణించినట్లు తెలిపారు. గాయపడిన మణిభారతి చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఆమ్ని బస్సు ఆలస్యం – ప్రయాణికుల ఆందోళన
తిరువొత్తియూరు: కన్యాకుమారికి వెళ్లేందుకు ఒక సంస్థకు చెందిన రెండు ప్రైవేట్ బస్సుల్లో ఆన్‌న్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వంద మందికి పైగా ప్రయాణికులు గురువారం రాత్రి కోయంబేడు ఆమ్ని బస్టాండ్‌కు వచ్చారు. అయితే, నిర్ణీత సమయానికి రావలసిన రెండు బస్సులు రాలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేశారు. బస్సు కంపెనీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీని గురించి ప్రయాణికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వగా, వానగరం పోలీసులు వచ్చి ప్రయాణికులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 63,843 మంది స్వామివారిని దర్శించుకోగా 21,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.