
నేత్ర దానంపై అవగాహన
వేలూరు: నేత్ర దానం చేయడంపై విద్యార్థులు అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. జాతీయ నేత్ర దాన వారోత్సవాల్లో భాగంగా వేలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వేలూరు అన్నాకలై అరంగం సమీపంలో విద్యార్థులతో నిర్వహించిన అవగాహన మానవహారాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 10న ప్రపంచ నేత్ర దాన దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. అందులో భాగంగా ఆగస్టు 25న ప్రారంభించి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే అవయవాలు దానం చేయడంపై ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందన్నారు. అదే తరహాలోనే నేత్ర దానం చేసేందుకు కూడా ముందుకు రావాలన్నారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులతోపాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా సేవకులు పాల్గొని వీటిపై పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రి డీన్ రోహిణిదేవి, కంటి ఆస్పత్రి విభాగం డీన్ విజయ్ చోప్రా, డాక్టర్ షర్మిలాదేవి, వేలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు, నర్శింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.