
ఘనంగా ఆవని నెల ప్రతీక ఉత్సవాలు
తిరువొత్తియూరు: మదురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ఆవని మూల ఉత్సవాల్లో భాగంగా ఆగ స్టు 29న జరిగిన తరుమిక్కు పొర్కిలి అలిత్తల్ లీలై (బంగారు బహుమతి) సన్నివేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రి యవిదై, మీనాక్షి అమ్మన్‌తో కలిసి సుందరేశ్వరస్వామి వారి పూర్తి అలంకరణలతో దర్శనం ఇచ్చారు.
ఎఫ్‌సీ సెంటర్లపై దృష్టి
సాక్షి,చైన్నె: వినియోగదారుల్లో విశ్వాసం పెరగడంతో వారికి మరింత చేరువగా సేవలను అందించే దిశగా చర్యలు విస్తృతం చేశామని అమెజాన్ ఫ్రెష్ డైరెక్టర్ శ్రీకాంత్‌శ్రీరామ్ తెలిపారు. చైన్నె వేదికగా జరిగిన సమావేశంలో తమ సేవలు, విస్తరణ అంశాలను ప్రకటించారు. వినియోగదారుల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొంటూ, రానున్న పండుగ సీజన్ దృష్ట్యా కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి సిద్ధమయ్యామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 12 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లను, ఆరు కొత్త స్టార్ సెంటర్‌లను ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఈ విస్తరణలో తమిళనాడులో రెండు కొత్త ఎఫ్‌సీలను ప్రారంభించామన్నారు. ఇందులో ఒకటి తిరువళ్లూరులో, మరొకటి కృష్ణగిరిలో ఏర్పాటు చేశామని ప్రకటించారు.
గణేష్ విగ్రహం చోరీపై ఫిర్యాదు
అన్నానగర్: వినాయక చతుర్థి సందర్భంగా బుధవారం చైన్నెలోని చూలైమేడులోని సత్యనగర్‌లో హిందూ మున్నని ఐదడుగుల గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. హిందూ మున్నని సంస్థ సభ్యుడు అంబేడ్కర్ చూలైమేడు పోలీస్‌స్టేషన్‌న్‌లో గణేశ విగ్రహాన్ని అనుమానితులు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈవిషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఫిర్యాదుకు సంబంధించి చూలైమేడు పోలీసులు మాట్లాడుతూ అనుమతి లేకుండా విగ్రహాన్ని ఉంచినందుకు, దానిని అక్కడి నుంచి తీసి అరుంబాక్కంలోని ఆలయం సమీపంలో ఉంచామని పోలీసులు తెలిపారు. విగ్రహాన్ని తీసుకెళ్లినప్పుడు, ఫిర్యాదు చేసిన అంబేడ్కర్ పేరు నిఘా కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయ్యిందని అని అన్నారు.
ఇద్దరు బ్యాంకు అధికారులకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష
అన్నానగర్: మోసపూరిత మార్గాల ద్వారా రుణాలు పొందడానికి ప్రముఖ చిత్రనిర్మాత దివంగత జి. వెంకటేశ్వరన్‌కు సహాయం చేశారనే ఆరోపణలపై దాఖలైన కేసులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ముగ్గురికి ప్రత్యేక సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మోసం కారణంగా బ్యాంకుకు రూ.10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించిన ప్రముఖ చిత్ర నిర్మాత దివంగత జి.వెంకటేశ్వరన్ 2003లో ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతనిపై ఉన్న అభియోగాలను తొలగించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సోదరుడు జీవీ, రజనీకాంత్ నటించిన తలపతి, అంజలి, విజయ్ నటించిన తమిళన్ తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీవీ, అతని భార్య సుజాత తమ కంపెనీలైన సుజాత ఫిల్మ్స్, సీవీ ఫిల్మ్‌స్ పేరుతో నకిలీ ప్రామిసరీ నోట్లను సెక్యూరిటీలుగా చూపి సెంట్రల్ బ్యాంక్ నుంచి రుణాలు పొందారు. బ్యాంకు అప్పటి మేనేజర్లు టి.ఆర్. వెంకటరామన్, పి. స్వామినాథన్, ప్రైవేట్ వ్యక్తి కె. శ్రీనివాసన్ దీనికి సహకరించారు. ఈ విషయంలో 1996లో బ్యాంక్ స్ట్రీట్ చీఫ్ ఆఫీసర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి చైన్నె సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇందులో బ్యాంకు మాజీ మేనేజర్లు వెంకటరామన్, స్వామినాథనన్‌కు తొమ్మిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.45 వేల జరిమానా విధించింది. మరో నిందితుడు కె. శ్రీనివాసన్‌కు ఆరేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించారు. ఇంకా జీవీ ఫిల్మ్‌స్ కు రూ.50 వేలు జరిమానా విధించింది. ఆరు నెలల్లోపు ఈ జరిమానా చెల్లించకపోతే, కంపెనీ ప్రతినిధి జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని కూడా తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో అకౌంటెంట్ ఎస్.ఆర్. శ్రీనివాసన్ విచారణలో మరణించారు.