కేటాయించాలని తిరువళ్లూరు ఎంపీ నిరాహారదీక్ష
తిరువళ్లూరు: రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తరచూ జరుగుతున్న అన్యాయంతో పాటు విద్యాశాఖకు నిధులను కేటాయించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరువళ్లూరు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం ఉదయం నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ శశికాంత్‌సెంథిల్ మాట్లాడుతూ విద్య మాత్రమే సమాజానికి నిజమైన స్వేచ్ఛను ఇవ్వగలదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు విద్యా నిధులను కేటాయించకుండా నిరాకరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ గాంధీ మార్గంలో తాము నిరాహారదీక్షను ప్రారంభిస్తున్నట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ పథఽకం కింద 2023వ సంవత్సరంలో రూ.249 కోట్లు, 2024వ సంవత్సరంలో రూ.2,152 కోట్లు విడుదల చేయలేదన్నారు. నూతన విద్యావిధానం ఆధారిత పీఎంశ్రీ పథకం అమలు చేయడంతో పాటు త్రిభాషా విధానాన్ని అమలు చేసే వరకు నిధులు కేటాయించబోమన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను వెంటనే కేటాయించాలని, నిధులు కేటాయించే వరకు నిరాహారదీక్షను కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు చిదంబరం, శశికుమార్, కలీల్‌రహ్మాన్, రామన్ పాల్గొన్నారు.