
ఆ తల్లికి ఎంత ఆనందమో!
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులోని క్యాంటీన్‌లో తల్లి కార్మికురాలుగా పనిచేస్తుంటే, అదే విద్యా సంస్థలో ఆమె తనయుడు ఇంజినీరింగ్ సీటును దక్కించుకుని అందరి దృష్టిలో పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆ విద్యార్థి ప్రస్తుతం తొలి సంవత్సరం కోర్సును అభ్యసించేందుకు సిద్ధమయ్యారు. ఐఐటీ మద్రాసు దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ, ఇక్కడ సీటు దక్కాలంటే, పోటీ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పలువురు పోటీ పరీక్షలలో తమ సత్తాను చాటుకున్నారు. ఐఐటీలోకి ప్రవేశించారు. పది మందికి పైగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు ఐఐటీ మద్రాసులో వివిధ కోర్సులను చేజిక్కించుకున్నారు. ఇందులో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఆనందం
సైదాపేటకు చెందిన కలైవాణి(44) ఐఐటీ మద్రాసులోని క్యాంటిన్‌లో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆమె కుమారుడు గౌరీశంకర్ సైదాపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్లస్‌టూ ముగించాడు. ప్రభుత్వం నేతృత్వంలో అందించిన శిక్షణ ఆధారంగా పోటీ పరీక్షలలో తన సత్తానుచాటుకున్నాడు. చైన్నె కార్పొరేషన్ బడిలో చదువుకున్న గౌరీ శంకర్‌కు ఐఐటీ మద్రాసులో సీటు దక్కింది. తన తల్లి కార్మికురాలుగా పనిచేస్తూ తన కోసం శ్రమిస్తున్న విద్యాసంస్థలోనే తాను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని కోర్సును చదువుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆనందానికి అవధులు లేవంటూ తల్లికుమారులు పేర్కొంటున్నారు. జేఈఈ పరీక్ష కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చిన శిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకం తనకు తోడు కావడంతో మంచి మార్కులతో సీటు దక్కించుకున్నట్టు గౌరీ శంకర్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరే వరకు తాను పనిచేస్తూనే ఉంటానని కలైవాణి తెలిపారు.