పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన విద్యార్థినులు
తిరుత్తణి: బస్‌స్టేషన్‌లో వేచివున్న విద్యార్థినులను మద్యం మత్తులో వేధింపులకు నిరసనగా పాఠశాల విద్యార్థినులు రాస్తారోకో చేసి పోలీస్‌స్టేషన్ ముట్టడించిన ఘటనకు సంబంధించి మహిళ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తరువాత రామంజేరి దళితవాడకు చెందిన ప్లస్‌టూ చదువుకుంటున్న బాలికలు పదిమంది ఇళ్లకు వెళ్లేందుకు బస్సు కోసం కనకమ్మసత్రం బస్టాపు వద్ద వేచివున్నారు. ఆ సమయంలో అటు వైపు మద్యం మత్తులో వెళ్లిన బాలురు బాలికలను చూసి అసభ్యంగా ప్రవర్తించి బూతులు మాట్లాడినట్లు, అందుకు బాలికలు మందలించినట్లు,దీంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ మద్యం మత్తులో వున్న వ్యక్తులకు మద్దతుగా అసభ్య పదజాలంతో విద్యార్థినులను వేధించడంతో ఆగ్రహం చెందిన బాలికలు పోలీస్ స్టేషన్ సమీపంలో చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో బైఠాయించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంఘటన ప్రాంతం చేరుకుని పోలీస్‌స్టేషన్ ముట్టడించారు. బాలికల పట్ల అసభ్య రీతిలో దూషించి దాడి యత్నం చేసిన మహిళ సహా వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే కనకమ్మసత్రంకు చెందిన మధుమిత(40)తో పాటు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మైనర్లు ముగ్గురు సహా నలుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


