
రామన్‌కు శుభాకాంక్షలు చెబుతున్న టీఎంసీ శ్రేణులు
పళ్లిపట్టు: టీఎంసీ రాష్ట్ర కోశాధికారి, పళ్లిపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జీకే.వాసన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రామన్ పళ్లిపట్టు ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు విశిష్ట సేవలందించారు. అతని హయాలో పళ్లిపట్టు ప్రాంతంలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొచ్చారు. ప్రధానంగా ప్రజలకు రవాణా సౌకర్యం కోసం బస్సు డిపోతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు వీలుగా బస్సు సేవలు, బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజల మధ్య డాక్టర్ రామన్ విశిష్ట గుర్తింపు పొందారు. ఈక్రమంలో బుధవారం జన్మదిన వేడుకలు జరుపుకున్న డాక్టర్ రామన్‌ను పొదటూరుపేటలోని అతని నివాసంలో కలుసుకున్న టీఎంసీ నాయకులతోపాటు వివిధ పార్టీల శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో టీఎంసీ అధ్యక్షుడు జీకే.వాసన్ ఫోన్ ద్వారా డాక్టర్ రామన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్‌లు – ఇద్దరి మృతి
తిరువొత్తియూరు: కల్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేట సమీపంలోని అతనూర్ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు గోవిందన్ (30) ఎలక్ట్రీషియన్. మంగళవారం సాయంత్రం అతనూర్, కుచిపలై రోడ్డుపై బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవిందన్, మరో బైక్‌పై వెళ్తున్న భువనూర్ గ్రామానికి చెందిన అలాషన్ కుమారుడు సుబ్బరాయన్ (35) ఇద్దరూ మతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్‌లో వస్తున్న భువనూర్ గ్రామ మాజీ పంచాయతీ అధ్యక్షుడు బాలకన్నన్ కుమారుడు సెల్వగణపతి (26) కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఉలుందూర్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉలుందూర్‌పేట బి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికను వివాహం చేసుకున్న టీచర్‌కు జైలు
అన్నానగర్: కృష్ణగిరి జిల్లాలోని తేన్ కనికొట్టై సమీపం కుంతుకొట్టై పంచాయతీలోని ఈరిచెట్టియారి గ్రామానికి చెందిన వేల్ మురుగన్ (26) అంజెట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక ప్రస్తుతం 5 నెలల గర్భవతి. చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు, ఆ బాలిక వయస్సు కేవలం 15 ఏళ్లు అని తేలింది. ఈ విషయం పై బాలల సంక్షేమ అధికారులు దర్యాప్తు నిర్వహించారు. తదనంతరం, తేన్ కనికొట్టై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తరువాత అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి ధర్మపురి జైలుకు తరలించారు.
బైక్‌ను ఢీకొన్న బస్సు – ఇద్దర మృతి
తిరువొత్తియూరు: దిండుగల్ సమీపంలో బుధవారం ఉదయం మోటారుసైకిల్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. దిండుగల్ జిల్లా శానార్‌పట్టి సమీపం పూవకిళవన్‌పట్టికి చెందిన తంగవేల్ కుమారుడు బాలసుబ్రమణి (25). ఇతను వడమదురైలోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తున్నాడు. ఇతని బంధువు తిరుచ్చి జిల్లా వయ్యంపట్టికి చెందిన తంగపిళ్లై కుమార్తె భువనేశ్వరి (22). బుధవారం ఉదయం బాలసుబ్రమణి తన మోటారుసైకిల్‌పై భువనేశ్వరిని ఎక్కించుకొని దిండుగల్ వైపు వస్తున్నాడు. గోపాల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి వస్తుండగా, నత్తం వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్నవారు వారిద్దరినీ చికిత్స కోసం అంబులెన్స్‌లో ద్వారా దిండుగల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే మార్గమధ్యంలోనే బాలసుబ్రమణి, భువనేశ్వరి మృతి చెందారు.
ఆన్‌లైన్‌లో రూ.2,683 కోట్ల మోసం – 2.35లక్షల మంది బాధితులు
కొరుక్కుపేట: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో రూ.2,683 కోట్లు ఆన్‌లైన్‌న్ ద్వారా మోసపోయారు. మొత్తం 2.35లక్షల మంది తమ నగదును కోల్పోయారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరం 1.27లక్షల మంది సైబర్ మోసం ద్వారా రూ.1,673 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు, 1.9లక్షల మంది నగదును పోగొట్టుకున్నారని రికవరీ చేసిన డబ్బులో రూ.772 కోట్లను సైబర్ నేరస్థులు స్తంభింపజేశారు, అందులో రూ.4 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి.