స్వామివారికి తీర్థవారి నిర్వహిస్తున్న శివాచార్యులు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో స్వామివారికి సోమవారం ఉదయం తీర్థవారి నిర్వహించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరువణ్ణామలై 14 కిలోమీటర్లు దూరం శివుడిగా భావించే కొండను చుట్టి స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం పట్టడంతో స్వామివారికి శివాచార్యులు వేదమంత్రాలు నడుమ ఈశాన్య కోనేటి వద్దకు స్వామివారిని తీసుకెళ్లి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి దీపారాధన పూజలు చేసి ఆలయానికి మేళతాళాల నడుమ తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండగా చంద్రగ్రహణం పట్టడంతో ఉదయం నాలుగు గంటల నుంచి ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేశారు.
పోస్టర్ల కలకలకం
కొరుక్కుపేట: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర ‘ఏకమైపోదాం. మనల్ని మనం నిరూపించుకుందాం’ అనే నినాదంతో శశికళ మద్దతుదారులు ఒక పోస్టర్‌ను అతికించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి సెంగోట్టయన్‌ను పళణిస్వామి తొలగించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సెంగోట్టయన్‌కు మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ నుంచి తొలగించారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం దగ్గర కలిసి పోరాడుదాం, గెలుద్దాం అంటూ వెలసిన పోస్టర్లు అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
భూగర్భ డ్రైనేజీ పనుల పరిశీలన
వేలూరు: కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను కాలయాపన చేసే కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం సర్కిల్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో డ్రైనేజీ పనుల కోసం కాలువలు తవ్వి మట్టిని రోడ్డు పక్కన వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని అన్నారు. ఈ పనులను నెలల తరబడి ఎందుకు కాలయాపన చేస్తున్నారో అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం చేసి పనులను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో కాంట్రాక్టర్ రద్దు చేయాలని కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు. ఆమెతోపాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా విన్నపాల దినోత్సవంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే సంక్షేమ పథకాలను అందజేశారు. కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంజీ కొనుగోలుదారులకు జీఎస్టీ ప్రయోజనాలు
సాక్షి, చైన్నె: ఐసీఈ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలోని ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ ఈవీ వాహన కొనుగోలుదారులకు జీఎస్టీ ప్రయోజనాలను కల్పిస్తూ చర్యలు తీసుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఇటీవల కేంద్రం జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకున్న దృష్ట్యా, ఆ ప్రయోజనాలు వాహన కొనుగోలుదారులకు కల్పిస్తూ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా స్థానికంగా ప్రకటన చేసింది. ఎంజీ ఎస్‌యూవీ బుక్ చేసుకోవడంపై ప్రయోజనాలు సెప్టెంబరు 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు వివరించారు. జీఎస్‌టీనీ హేతుబద్దీకరించాలనే ప్రభుత్వం నిర్ణయంతో కారు కొనుగోలుదారుల స్థోమత సవాలును నేరుగా పరిష్కరించే విధంగా తాము చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రయోజనం తమ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో అంతటా విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింతగా అవకాశాలు కల్పించేందుకు వీలుందన్నారు. మరింత అందుబాబులో ఆకర్షణీయంగా వాహనాలను, ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా స్పష్టం చేశారు.
క్లుప్తంగా


