
ప్రజాస్వామ్యం అపహాస్యం
విచ్చలవిడి అధికారాలతో కేంద్రానికి రక్తపోటు
అధికారాల కోతతో రాష్ట్రానికి రక్త హీనత
ఫలితం...అనారోగ్యం
సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కొందరి తీరుతో..
పరిమితికి మించిన అధికారాలను చెలాయిస్తున్న పాలకుల వల్ల కేంద్రానికి రక్తపోటు... ఉన్న అధికారాల్లోనూ కోతల కారణంగా రాష్ట్రానికి రక్త హీనత తప్పడం లేదని సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా అనారోగ్యం అంటూ, ఇందుకు కేంద్ర పాలకుల అసమర్థతే కారణం అని విమర్శించారు. వాస్తవానికి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బదులు, అధికార వర్గం అజమాయిషీ పెరుగుతోందని మండిపడ్డారు.
సదస్సులో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: చైన్నెలోని కలైవానర్ అరంగంలో శనివారం కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై జాతీయ సెమినార్ జరిగింది. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై చారిత్రాత్మక ఘటనలను, అంశాలను గుర్తు చేస్తూ జరిగిన ఈ సదస్సుకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ చలమేశ్వర్‌లు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై తొలి జాతీయ సెమినార్‌ను తమిళనాడు నిర్వహించడం, దీనిని తాను ప్రారంభించడం ఆనందంగా, గర్వంగానూ ఉందన్నారు. వేల సంవత్సరాలుగా అనేక ప్రత్యేక లక్షణాలను ఈ తమిళ భూమి కలిగి ఉందన్నారు. ఇక్కడ అందరూ సమానమే అనే సమానత్వ ఆలోచన ఆధారంగా అందరికీ అన్నీ నినాదంతో తన ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. హక్కుల సాధన, సామాజిక న్యాయం, సిద్ధాంతాలను అనుసరించి ఇక్కడ అనేక ప్రగతి శీల చట్టాలు ఆమోదించ బడ్డాయని వివరించారు. ఆ దిశగానే ప్రణాళికలను కూడా రచించి అమలు చేస్తూ వస్తున్నామని, దీనికి పునాది ద్రావిడ ఉద్యమంగా పేర్కొన్నారు. పిట్టి త్యాగరాయర్ నుంచి అన్నా, కలైంజ్ఞర్ వరకు సమానత్వం, సామాజిక న్యాయం ,మహిళా హక్కులు, ఆదర్శనాల కోసం పోరాడారని వివరించారు. తమిళనాడు రాజకీయాలు అంటే సామాజిక న్యాయం అని, తమిళనాడులో ఆర్థిక వృద్ధి, ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలను చేరుతూ వస్తున్నట్టు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు అన్ని రంగాలలో అగ్రగామని రాష్ట్రంగా కొనసాగుతోంది, ఎదుగుతోందని వ్యాఖ్యలు చేశారు.
వారికే అధిక ప్రాధాన్యత..
ఈసందర్భంగా తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న తీరును గుర్తు చేస్తూ, బీజేపీ అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా ప్రాధాన్యతను ఇస్తూ, బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై చిన్న చూపు తగదని మండి పడ్డారు. రాష్ట్రాలకు తగిన నిధులు అందించాలని డిమాండ్ చేస్తూ, గత నాలుగు సంవత్సరాలలో నిధుల వ్యవహారంలో తాము ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. కేంద్రం నుంచి సరైన సహకారం కొరవొడినా, అంచెలంచెలుగా పరిస్థితిని అధిగమించి నేడు ఆర్థికవృద్ధిని రెండు అంకెల స్థాయికి తీసుకెళ్లామని ధీమా వ్యక్తంచేశారు. జస్టిస్ చలమేశ్వర్ ఇక్కడ ప్రత్యేక ప్రసంగం చేశారని గుర్తు చేస్తూ, ప్రస్తుత న్యాయ విధానాలు, ప్రభుత్వం విభాగాల పద్ధతులలో తన అనుభవాన్ని, ఆలోచనలను ఆయన పంచుకున్నారని వివరించారు. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య వాదం అనే సూత్రం ఐక్యతను బలోపేతం చేస్తుందన్నారు. ఈ విషయంగా జస్టిస్ కురియన్ మాట్లాడినప్పుడు ఒకే వాక్యంలో రూపంలోచక్కగా వివరించారని పేర్కొంటూ, అన్నింటి కన్నా రాజ్యాంగం గొప్పదని స్పష్టం చేశారన్నారు. స్వయం సంవృద్ధి గల రాష్ట్రాల ప్రయత్నాల ద్వారా మాత్రమే ఐక్యత భారతదేశ బలంగా మారుతుందని, బలహీన రాష్ట్రాల వల్ల భారతదేశం పతనం వైపుగా వెళ్తుందన్న విషయాన్ని కేంద్రం గుర్తెరగాలని హితవు పలికారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి విధానం కోసం శ్రద్ధ వహించే విధంగా ప్రతి ఒక్కరూ తమ స్వరాన్ని పెంచాలని, ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తరహాలో కమిటీలను దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హోదా కోసం తమిళనాడు పోరాడుతుందని, ఇందులో తమిళనాడు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఉన్నత స్థాయి కమిటీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు.
నిధుల కష్టాలు..
అనేక పరోక్ష పన్నులతో పాటూ జీఎస్‌టీ రూపంలో అధిక ఆదాయం అన్నది కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు నుంచే ఉంటున్నదని వివరించారు. అయితే వారు తిరిగి ఇచ్చే మొత్తం మరీ తక్కువగా ఉంటున్నదని, అంతే కాదు, నిధుల పంపిణీలోనూ వివక్షతకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంకుచిత రాజకీయ లక్ష్యాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబడుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అనేక అద్భుతమైన సామాజిక–ఆర్థిక ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేశామని, గత నాలుగు సంవత్సరాలలో ద్రావిడ మోడల్ పాలన వివిధ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లామని వివరించారు. సంక్షోభాలు ఎ దురైనా, కేంద్రం నిర్లక్ష్యానికి గురైనా, ఆర్థికంగా బలోపేతం దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్‌లలో బీజేపీయేతర పార్టీలనాయకత్వంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రాలపై రాజ్యంగ నిబంధనలను కేంద్రం పాలకులు ఉల్లంఘిస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కశ్మీర్‌లో ప్రజలతో ఎన్నికై న ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలనను తీసుకొచ్చి ఘనత ఈ కేంద్రం పాలకులది కాదా..? అని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను నిరంతరం ఎలా కాలరాయాలో అన్న దిశగానే కేంద్రం చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో రాజ్యాంగ సవరణను ప్రతిపాదించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించామని పేర్కొంటూ, గతంలో జస్టిస్ సర్కారియా కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రక్త పోటు...రక్త హీనత
కేంద్ర ప్రభుత్వం అధిక అధికారాన్ని కూడబెట్టుకోవడం వలన దానికి రక్త పోటు తప్పడం లేదని, అధికారాల కోతతో రాష్ట్రాలకు రక్త హీనత ఎదురు అవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఫలితం అనారోగ్యం తప్పదన్నారు. కేంద్రం నిర్లక్ష్యం, అసమర్థతే ఇందుకు కారణంగా ధ్వజమెత్తారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పాలనలో రాష్ట్రాల హక్కులను కాపాడటానికి అధ్యయన బృందం ఏర్పాటు చేయాలని డీఎంకే పట్టుబడ్డటంతో 2007లో ఏర్పాటైన కమిషన్ చేసిన సిఫారసులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం నేటికీ ఒక్కటంటే ఒక్క సిఫారసును పరిగణించ లేదని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం