
వేలూరులో కుండపోత వర్షం
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలైలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. రోడ్లు, వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. అదేవిధంగా వర్షపు నీరు వేలూరు నేతాజీ మార్కెట్‌లోకి చేరుకోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇదిలా ఉండగా కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలూరు గ్రీన్ సర్కిల్, కొత్త బస్టాండ్, బజారు వీధి పూర్తిగా వర్షపు నీటితో నిండి పోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలూరు పట్టణంలోని కన్‌సాల్‌పేటలో 40 ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు డ్రైనేజి కాలువ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే కార్పోరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి వెల్లి నీటిని విద్యుత్ మోటర్లు ద్వారా నీటిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఆంబూరులోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యారు, ఆరణి, తిరువణ్ణామలై, పోలూరు, తండ్రాంబట్టు ప్రాంతాల్లోను శనివారం ఉదయం నుంచి వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సందవాసల్, పడవేడు, పుష్పగిరి ప్రాంతాల్లోని అరటి తోటలు, చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేల మట్టమయ్యాయి.
తిరువళ్లూరు జిల్లాలో..
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చోళవరం, తిరుత్తణిలో 131మిమీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పళ్లిపట్టులో 30మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 76మి.మీ వర్షపాతం నమోదు కావడంతో ప్రధాన రిజర్వాయర్‌లు, చెరువులు, కాలువల్లో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్‌కు నీరు రాక పెరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం : తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. తిరువళ్లూరులో 113మిమీ, పూండిలో 104మిమీ, తిరువేళాంగాడులో 96మిమీ, జమీన్‌కొరట్టూరులో 90మిమీ, తామరపాక్కంలో 83మిమీ, ఆర్కేపేటలో 82మిమీ, పూందమల్లిలో 62మిమీ, గుమ్మిడిపూండిలో 55మిమీ, రెడ్‌హిల్స్‌లో 48మిమీ, ఊత్తుకోటలో 43మిమీ, ఆవడిలో 40మిమీ, పొన్నేరిలో 38మిమీల వర్షపాతం నమోదైంది.

వేలూరులో కుండపోత వర్షం

వేలూరులో కుండపోత వర్షం