
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
వేలూరు: విద్యార్థులకు క్రీడలతోనే శారీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని ఎస్పీ మయిల్‌వాగణన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సన్‌బీమ్ మెట్రిక్ పాఠశాలలో వార్షికోత్సవ క్రీడా దినోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాలలోని టీచర్‌లతో పాటూ తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. పాఠశాలలోనూ, ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమశిక్షణతో ఉంటారన్నారు. విద్యార్థులకు ఇష్టమైన పనులు చేసేందుకు పెద్దలు, ఉపాధ్యాయులు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులు వీరి జీవితాలను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు పట్టుదల, క్రమ శిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు. జీవితంలో ఏదైనా సాదించాలనే ధ్యేయంతో అభ్యసించాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటూ సర్టిఫికెట్లును అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తంగ ప్రకాశం, వైస్ చైర్మన్ జార్జీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.