
కోలాహలం..ఆవణి రథోత్సవం
సాక్షి, చైన్నె: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి మాసం బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్త జనుల హరోంహర నామస్మరణ మార్మోగింది. ఆరుపడై వీడుల్లో రెండవదిగా తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ గత వారం రోజులుగా ఆవణి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బంగారు రథం, పల్లకి వాహనాలలో సర్వాలంకరణలతో స్వామివారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. శనివారం రథోత్సవం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో సముద్ర తీరంలో ఉన్న తిరుచెందూరు భక్త సాగరంలో మునిగినట్లైంది. వేకువ జాము నుంచి ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు రథంపై దర్శనం ఇచ్చారు. హరోంహర నామస్మరణ మిన్నంటగా రథోత్సవం కనుల పండువగా జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, దేవదాయశాఖ నేతృత్వంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం నేతృత్వంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.