
8 జిల్లాలకు అలర్ట్
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో చైన్నె, శివారులలో వాతావరణం పూర్తిగా మారింది. అనేక చోట్ల కుండపోతగా వర్షం పడింది. డెల్టాలలోని ఎనిమిది జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈనెల 29వ తేదీ వరకు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. వివరాలు.. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక జిల్లాలో చెదరు ముదురుగా వర్షాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి చైన్నె శివారులలో వర్షం పడుతూ వస్తోంది. శుక్రవారం రాత్రి కూడా ఈ వర్షాలు కొనసాగాయి. చైన్నె శివారులలోని తాంబరం, వండలూరు, గూడువాంజేరి పరిసరాలు, శ్రీపెరంబదూరు పరిసరాలు, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, చెంగల్పట్టు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల కుండపోత వాన పడింది. శివారులలో వర్షాలతో పూండి, చోళవరం, పుళల్, చెంబరంబాక్కం రిజర్వాయర్‌లలోకి నీటి రాక క్రమంగా పెరుగుతోంది. ఇక చైన్నె నగరంలో గిండి, సైదాసేట, బ్రాడ్ వే, ఐనావరం, విల్లివాక్కం, అశోకన్ నగర్, మైలాపూర్, పరిసరాలలో భారీగానే వర్షం పడింది. అత్యధికంగా బ్రాడ్ వేలో 15 సెం.మీ, కొరట్టూరులో 13 సెం.మీ వర్షం పడింది. బంగాళాఖాతంలో ఈనెల 25వ తేదిన అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, నాగపట్నం వంటి డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు, చైన్నె శివారులలో మోస్తరు వర్షాలు పడుతాయని ప్రకటించారు. ఈనెల 29వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వివరించారు. 29వ తేదీన నీలగిరి, కోయంబత్తూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చైన్నె, శివారులలో శనివారం మధ్యాహ్నం వరకు వర్షం పడింది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతంగా మారింది. ఈ వర్షానికి తోడుగా ఈదురు గాలులల రూపంలో పదిచోట్ల చెట్లు నేలకొరిగాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని ఆగమేఘాలపై తొలగించారు. తాజా వర్షానికి రోడ్డులు గతుకులమయం కావడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు.
విద్యుదాఘాతంతో కార్మికురాలి మృతి
చైన్నె శివారులలో కురిసిన వర్షం ఓ పారిశుధ్య కార్మికురాలిని బలిగొంది. శనివారం ఉదయాన్నే ఐదు గంటలకు కన్నగి నగర్‌కు చెందిన వరలక్ష్మి(30) ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులలో నిమగ్నమయ్యారు. రోడ్డుపై పనులలో ఉండగా ఓ చోట నీళ్లు చేరి ఉండటంతో శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మరణించారు. దీనిని చూసిన ఆ పరిసర వాసులు ఆందోళనకు గురై విద్యుత్ బోర్డుకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు తేల్చారు. మృతురాలు కన్నగినగర్ వాసి కావడంతో అక్కడి ప్రజలలలో ఆగ్రహం వ్యక్తమైంది. అదే సమయంలో ఆమె పనిచేస్తున్న కాంట్రాక్టు సంస్థతో పాటూ ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఆమె ఇంటికి చేరుకుని ఇద్దరు పిల్లలు, భర్తను ఓదార్చారు. కన్నగినగర్ వాసులకు తాము ఉన్నామన్న భరోసా ఇచ్చారు. వరలక్ష్మి కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించారు. ఆమె ఇద్దరు పిల్లలు విద్యా ఖర్చులన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ప్రకటించారు. ఆమె భర్తకు ఉద్యోగం ఇస్తామన్న హామీ ఇచ్చారు. సాయంత్రం వరలక్ష్మి భౌతిక కాయాన్ని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ సందర్శించి నివాళులర్పించారు.

8 జిల్లాలకు అలర్ట్

8 జిల్లాలకు అలర్ట్

8 జిల్లాలకు అలర్ట్

8 జిల్లాలకు అలర్ట్