
అవయవ దాతల కుటుంబాలకు సత్కారం
సాక్షి, చైన్నె: తమ వాళ్లు మరణం అంచున ఉన్నా, బరువెక్కిన గుండెతో బాధను దిగమింగుకుని వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబాలను ఎంజీఎం హెల్త్ కేర్ సత్కరించింది. మరొకరి ప్రాణాలను రక్షించేందుకు నిస్వార్థంగా కృషి చేసిన అవయవ దాతలను, వారి కుటుంబాలను సత్కరించుకునేవిధంగా శనివారం స్థానికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ నటి నీలిమా రాణి, అన్నానగర్ ఎమ్మెల్యే ఎంకే మోహన్‌లు ఈ సందర్భంగా మైల్స్ ఫర్ లైవ్ అనే అంశంపై వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ డిసీజెస్, ట్రాన్స్ పాలట్, అండ్ హెపీబీ సర్జరీ నేతృత్వంలో ఈ వాక్ థాన్, సత్కార కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ మాట్లాడుతూ, దాతల సత్కారం, వాక్‌థాన్ కార్యక్రమం గురించి గుర్తు చేస్తూ , వైద్య శాస్త్రం అద్భుత అభివృద్ధిని సాధించిందన్నారు. లివింగ్, కాడేవర్ డొనేషన్లు రెండు సురక్షితం అని, జీవించి ఉన్న దాతలు ఒక కిడ్నీ లేదా, కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడానికి వీలుందన్నారు. దీని వలన దాత , గ్రహీత ఇద్దరూ ఆరోగ్యంగా, సంతృప్తికర జీవితాన్ని గడపవచ్చని వివరించారు. కాడేవర్ విరాళాలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాలు, ప్యాంక్రియాస్, కార్నియాస్ వంటి అవయావాల ద్వారా బహుళ ప్రాణాలను రక్షించ బడుతాయని వివరించారు. సీనియర్ వైద్యులు , డైరెక్టర్ త్యాగరాజన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అవయవదానం అత్యాధునిక వైద్యానికి లభించే గొప్ప బహుమతులలో ఒకటిగా పేర్కొన్నారు. అవయదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అవయవ దాతల కుటుంబాలకు సత్కారం