
ఎంపీల మద్దతు వేటలో అభ్యర్థులు
సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఎంపీల ఓట్లను గురిపెట్టి ఉప రాష్ట్రపతి అభ్యర్థులు చైన్నె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చైన్నెకు రానున్నారు. సోమ లేదా మంగళవారం బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ రాబోతున్నారు. వివరాలు.. రాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబరు 9న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. తమిళనాడు వాసి కావడంతో ఇక్కడున్న ఎంపీలు పార్టీలకు అతీతంగా ఆయన్ని ఆదరించాలనే నినాదం తెరమీదికి వచ్చింది. ఇక్కడున్న పార్టీలతో, ఎంపీలుతో సీపీ రాధాకృష్ణన్‌కు వ్యక్తిగతంగా పరిచయాలు, సాన్నిహిత్యం ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రంగంలోకి దిగి ఉండడంతో ఓట్ల వేట ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమిలో డీఎంకే కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లన్నీ సుదర్శన్‌రెడ్డి ఖాతాలో చేరాల్సిందే. కాగా ఈ ఇద్దరు అభ్యర్థులు ఎంపీలను ప్రసన్నం చేసుకునేందుకు చైన్నె వైపుగా కదిలేందుకు సిద్ధమయ్యారు.
నేడు చైన్నెకి సుదర్శన్‌రెడ్డి
ఇందులో ముందుగా సుదర్శన్‌రెడ్డి ఆదివారం చైన్నెకు రానున్నారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను కలవనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో ఎంపీలతో, డీఎంకే కూటమి పార్టీల నేతలతో సమావేశం కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో లోక్‌సభ సభ్యులు 39 మంది ఉన్నారు. ఇందులో డీఎంకే సభ్యులు 22 మంది (ఒకరు కొంగునాడు మక్కల్‌దేశీయ కట్చి ఎంపీ), కాంగ్రెస్ –తొమ్మిది, సీపీఎం, సీపీఐ, వీసీకే తలా ఇద్దరు, ఎండీఎంకే ఒకరు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ ఒకరు ఉన్నారు. ఈ పార్టీలన్నీ ఇండియా కూటమిలో నే ఉన్నాయి. అయితే సీపీఆర్‌కు ఇందులో అనేక మంది ఎంపీలకు వ్యక్తిగత పరిచాయాలు ఉండడం ఆసక్తికరం. ఇక రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే తమిళనాడు నుంచి మొత్తం 18 మంది ఉన్నారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే సభ్యులు కాగా, మరొకరు అన్నాడీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లిన తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఉన్నారు. కాగా అన్నాడీఎంకే తరపున రాజ్యసభకు వెళ్లిన ధర్మర్ ఆ తదుపరి పరిణామాలతో తాను స్వతంత్రం అంటూ వేరుగా అడుగులు వేస్తున్నారు. డీఎంకేకు చెందిన పదిమంది , కాంగ్రెస్ ఒకరు, మక్కల్ నీది మయ్యం నుంచి మరొకరు రాజ్య సభకు వెళ్లి ఉండడం గమనార్హం. ఎంపీల ప్రసన్నం కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రాకతో తమిళనాట రాజకీయ సందడి ఊపందుకున్నట్లయ్యింది.

ఎంపీల మద్దతు వేటలో అభ్యర్థులు