
వినాయక చవితికి నిబంధనలు పాటించాలి
వేలూరు: కాట్పాడి ప్రాంతంలో వినాయకచవితికి 10 అడుగులకు పైగా వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించరాదని డీఎస్పీ పయణి స్పష్టం చేశారు. ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ట, ఊరేగింపు, బందోబస్తు ఏర్పాట్లపై హిందూ మున్నని, ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులతో ఆయన కాట్పాడిలోని తాలుకా కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వరన్ అధ్యక్షతన సమీక్షించారు. వినాయక చతుర్థికి విగ్రహ ఊరేగింపును పోలీసులు సూచించిన దారిలోనే చెరువుకు తీసుకెళ్లాలన్నారు. అనుమతి పొందిన ప్రాంతాల్లో మాత్రమే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేపట్టాలన్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తే పోలీసుల బందోబస్తు నిర్వహించేందుకు కుదరదని వారి సొంత పూచి కత్తులపై విగ్రహాలు ఏర్పాటు చేస్తే అందుకు నిర్వహకులే బాధ్యత వహించాలన్నారు. ఊరేగింపు సమయంలో ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. ఉదయం ఊరేగింపును ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయాలని ట్రాఫిక్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కల్పించరాదన్నారు. సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, హిందూ మున్నని సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.