
చాలా చిత్రాల్లో అసంతృప్తితోనే నటించా!
తమిళసినిమా: సంచలన కథానాయికల్లో నటి సమంత ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. ఈమె ప్రస్తుతం చిత్రాల్లో నటిస్తున్నారో లేదోగానీ ఆమె గురించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. సమంత ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాగానే ఆడింది. ప్రస్తుతం కథానాయకిగా మరో రెండు కొత్త చిత్రాలకు సంతకం చేశారనే ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఈ అమ్మడు నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని ప్రచారం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటిలో ఏది నిజం అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే సమంత మాత్రం విమర్శలను, ట్రోలింగులను ఎదుర్కొనే మానసిక పరిపక్వత నటీమణులకు ఉండాలనే అభిప్రాయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంతకుముందు తమిళం, తెలుగు భాషల్లో నాన్‌స్టాప్‌గా అత్యధిక చిత్రాలను చేసి స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సమంత ఇప్పుడు ఎక్కువ చిత్రాల్లో నటించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ మధ్య మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం కావచ్చు. అయితే ఇటీవల శారీరక వ్యాయామం, విదేశీ పయనాలపై ఈమె ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.దీని గురించి సమంత మాట్లాడుతూ ఇప్పుడు తనను ఉత్సాహపరిచే విషయాలను మాత్రమే చేస్తున్నానని చెప్పారు. అది సినిమా అయినా శారీరక వ్యాయామం అయిన సరే అని పేర్కొన్నారు. ఇంతకుముందు పలు చిత్రాల్లో వరుసగా నటించానని అయితే నిజం చెప్పాలంటే వాటిల్లో చాలావరకు తనకు సంతృప్తి కలిగించని చిత్రాలేనని చెప్పారు. కాగా ఇప్పుడు ఎలాంటి సినిమానైనా పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తున్నానని చెప్పారు. ఒకేసారి ఐదారు చిత్రాలు చేయాలన్న ఒత్తిడి మాత్రం తనపై లేదన్నారు. తన శరీరం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకొని అనుసరిస్తున్నట్లు, అందుకే పనిని తగ్గించుకున్నట్లు సమంత చెప్పారు.