
ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా
వేలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం కార్యదర్శి మాయవన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు మలైస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయక పోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌సీ, ఎస్‌టిలకు చెందిన పట్ట భద్రులు నిరుద్యోగులుగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారానికి వచ్చిన వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఆశ చూపించి కనీసం ఒక్క శాఖలో కూడా పోస్టులను భర్తీ చేయక పోవడం సరికాదన్నారు. ప్రతి నెలా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పదవీ విరమణ పొందుతున్నా కనీసం ఆ పోస్టులు కూడా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులతోనే సరి చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల రిజర్వేషన్‌ను పెంచడంతో పాటు కనీసం ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర నిధి కార్యదర్శి పుదియవన్, జిల్లా కార్యదర్శి సెల్వం సభ్యులు పాల్గొన్నారు.