
తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం
అన్నానగర్: కొడైకెనాల్ సమీపంలో స్ప్పహ కోల్పోయిన ఏనుగుకు అటవీ అధికారులు 8 గంటలు చికిత్స అందించారు.ఈ క్రమంలో గున్న ఏనుగు తల్లిని వదలకుండా పోరాడిన వైనం ఆకట్టుకుంది. వివరాలు.. కొడైకెనాల్ కొండలలోని అడవి ఏనుగులు తమ సహజ ఆవాసాలను విడిచిపెట్టి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ భూములలో మకాం వేస్తున్నాయి. ఈ పరిస్థితిలో, కొడైకెనాల్ తాలూకాలోని విల్పట్టి పంచాయతీ పరిధిలోని అలతురై పక్కన ఉన్న గణేశపురం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ తోటలో ఒక ఆడ ఏనుగు అపస్మారక స్థితిలో కనిపించింది. దాని సమీపంలో ఒక గున్న ఏనుగు నిలబడి ఉంది. ఇది చూసిన తోట యజమాని సెల్వం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అటవీ అధికారులు, పశువైద్యుల బృందం వైద్య పరికరాలతో అక్కడికి చేరుకుని చికిత్స అందించి కాపాడారు. ఈక్రమంలో తన తల్లికి అపకారం తలపెడుతారనే తలంపుతో వారిని అడ్డుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆరోగ్యం బాగాలేని ఆడ ఏనుగు వయస్సు దాదాపు 55 సంవత్సరాలు. అది మూడేళ్ల క్రితం ఓ ఏనుగుకు జన్మనిచ్చింది. తగినంత పోషకాహారం లేకపోవడంతో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై స్ప్పహ కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.