
వ్యాపార వేత్తలుగా ఎదగాలి
తిరువళ్లూరు: హిజ్రాలు యాచించే స్థాయి నుంచి వ్యాపార వేత్తలుగా ఎదగాలని, అందుకు జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన మేరకు సహాయ సహకారాలను అందిస్తామని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న హిజ్రాలతో తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ రైళ్లలో కొందరు హిజ్రాల ఆగడాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోకుండా రైలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, బెదిరింపులకు దిగడం, యాచించడం లాంటి చర్యలకు దిగడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేశాఖ భద్రత విభాగం డిప్యూటీ కమిషనర్ హఫీల్‌బక్సాస్‌లా మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు హిజ్రాల వ్యవహరశైలి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందన్నారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలకు దిగాలనుకున్న ప్రతిసారి మానవతావాదంతో మౌనంగా ఉంటున్నామన్నారు. హిజ్రాల ఎదుగుదలకు జిల్లా యంత్రాంగంతోపాటు రైల్వేశాఖ సైతం అవసరమైన మేరకు తమ పరిధిలో ఉన్న అవకాశాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి వనిత తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లు రైళ్లలో యాచన చేయకూడదు
కొరుక్కుపేట: చైన్నెలో ట్రాన్‌న్స్‌జెండర్లు ప్రజా ప్రదేశాలు, బస్సులు, రైళ్లు, ఇతర ప్రదేశాల్లో యాచించ కూడదని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు జెబస్తినియో, శివనేసన్ సూచించారు. చైన్నె ఎగ్మోర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేషనన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు చైన్నెలో పలు ప్రదేశాల్లో ప్రయాణికులను డబ్బులు అడిగి వేధించే సంఘటనలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లలో ఒక కంపార్ట్‌మెంట్ నుంచి మరొక కంపార్ట్‌మెంట్‌కు వెళ్లి ప్రయాణికుల తలలను తాకడం, డబ్బులు వసూలు చేయడం నిరంతరం జరుగుతోందన్నారు. చాలా మంది ప్రయాణికులకు ఇది ఇబ్బందిగా ఉందన్నారు. అయితే, కొందరు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చి, ట్రాన్స్‌జెండర్లు వచ్చిన వెంటనే వారిని పంపించేస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రయాణికులను దూషిస్తున్నారని అన్నారు. కళాశాల విద్యార్థులను, టీనేజర్లను తక్కువ చేసి మాట్లాడి డబ్బులు వసూలు చేయడంలో వారిపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇకపై రైళ్లలో ప్రయాణికులను డబ్బు అడగకూడదని, ఎవరినీ అవమానించకూడదని లేదా బెదిరించకూడదని, ప్రభుత్వం మీకు వివిధ సహాయాలను అందిస్తోందని, వాటి ద్వారా మీరు మీ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని చెప్పారు.