
సెవ్వాపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పునః ప్రారంభం
● 11 ఏళ్ల తరువాత పనులకు మోక్షం
తిరువళ్లూరు: అనివార్య కారణాలతో ఆగిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను సుమారు 11 ఏళ్ల తరువాత అదనపు నిధులతో శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా సెవ్వాపేట రైల్వేస్టేషన్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను 11 ఏళ్ల కిందట ప్రారంభించారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ఒకవైపు పూర్తి కాగా మరోవైపు ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంతో నివాసాలను కోల్పోయే బాధితులు కోర్టును ఆశ్రయించడంతోపాటు మరి కొందరు అదనపు పరిహారం కోసం స్టే తెచ్చుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఇదే సమయంలో భవన నిర్మాణ రంగానికి చెందిన వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణం భారంగా మారి కాంట్రాక్టర్ వెళ్లిపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల కోర్టు అడ్డంకులు తొలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.8.11 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణస్వామి నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఉదయం పునః ప్రారంభించారు.