
చెరువు మట్టి తరలింపుపై గ్రామీణుల నిరసన
పళ్ళిపట్టు: చెరువులో మట్టి తరలింపుపై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ భారీ గుంతలు ఏర్పడి, భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం నెలకొందని కీచ్చళం వాసులు శుక్రవారం నిరసన చేపట్టారు. పంట సాగుకు అనువుగా పొలం చదును చేసుకోవడానికి రైతులు ప్రభుత్వ అనుమతితో చెరువు మట్టిని తరలించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతులు తమ చిట్టాను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేసి తహసీల్దార్ అనుమతితో ట్రాక్టర్లలో మాత్రమే చెరువు నుంచి ఎర్రమట్టిని తరలించే అవకాశం ఉందన్నారు. అయితే పళ్లిపట్టు యూనియన్ కీచ్చళంలో రైతుల పేరిట కొంత మంది తహసీల్దార్ నుంచి అనుమతి పొంది కీచ్చళం చెరువు నుంచి పది రోజులుగా జేసీబీ సాయంతో వందలాది ట్రక్కుల్లో మట్టిని తరలించి, ట్రక్కు రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. దీంతో చెరువులో భారీగా గుంతలు ఏర్పడి భూగర్భజలాలు అడుగంటడంతోపాటు ట్రాక్టర్ల వేగంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆరోపించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు మట్టి ట్రాక్టర్లు, జీసీబీని అడ్డుకున్నారు.