
చెరువుల్లో ముళ్ల చెట్లను తొలగించండి
వేలూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లోని ముళ్ల చెట్లను తొలగించి వర్షపు నీరు చెరువుల్లో, కుంటల్లో నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నేతలు సూచించారు. వేలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నేతలతో సమవేశం జరిగింది. రైతులు మాట్లాడుతూ కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని, వర్షం వస్తే ఇందులో నీరు పారి కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచిపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని వదలడం ద్వారా పాలారు కలుషితమవుతోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా చెరువుల్లోనే నిల్వ ఉండే విధంగా కాలువులను శుభ్రపరచడంతో పాటు చెరువులను కూడా శుభ్రం చేయాలన్నారు. పంటలను అడవి ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నాయని వీటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గిడ్డంగికి రైతులు తీసుకెళ్లే వడ్లను నిల్వ ఉంచకుండా వెంటనే తూకం వేసి పంపాలన్నారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి కాంచన, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ స్టీబర్ జయకుమార్, రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.