
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
తిరువళ్లూరు: నాటుబాంబు విసిరి యువకుడి హత్యకు యత్నించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు యువకులు పరుగులు తీసే సమయంలో వారికి కాలు విరిగింది. గాయపడ్డ ఇద్దరిని వైద్యశాలకు తరలించి చికిత్స అందించిన తరువాత రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా చిట్రంబాక్కం గ్రామానికి చెందిన ఓబుల్ కుమారుడు సేతురామన్. ఇతను గత రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఉండగా కారులో వచ్చిన గుర్తు తెలియని యువకులు అతడినిపై నాటుబాంబులు విసిరి హత్య చేయడానికి యత్నించారు. అయితే సేతురామన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడంబత్తూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో గంజాయి విక్రయించే విషయంలో సేతురామన్‌కు ఇరుళంజేరి గ్రామానికి చెందిన ముఖేష్ గ్రూపు మధ్య పాతకక్షలు వున్నట్టు తెలిసింది. ఈ కక్షతోనే నాటుబాంబు విసిరి హత్య చేయడానికి ప్రయత్నించారన్న కోణంలో పోలీసులు నిర్ధారించారు. ఇరుళంజేరి గ్రామానికి చెందిన భరత్ కుమారుడు ముఖేష్(22), అరుల్‌దాస్ కుమారుడు అభిమన్యు(24), శివకుమార్ కుమారుడు వినోధ్‌కుమార్(25)లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తరలించే క్రమంలో ముఖేష్, అరుల్‌దాస్ వ్యాన్ నుంచి దూకి తప్పించుకోవడానికి యత్నించడంతో వారి కాళ్లకు గాయమైంది. గాయపడ్డ వారిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించి రిమాండ్‌కు తరలించారు.