
అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని గురువారం సినీనటుడు నాగ చైతన్య, శోభిత దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీనటులను చూసిన భక్తులు వారితో కలసి పెద్ద ఎత్తున సెల్ఫీలను దిగేందుకు పోటీపడ్డారు.
రాజనాలబండ హుండీ ఆదాయం రూ.4.13 లక్షలు
చౌడేపల్లె: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూపేణా రూ.4.13 లక్షలు సమకూరిందని, దీనిని ఆలయ ఖాతాకు జమ చేస్తామని టీటీడీ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇటీవల రాజనాలబండలో నిర్వహించిన తిరునాళ్ల సందర్భంగా భక్తులు హుండీ సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సీవీ. శ్రీహర్ష, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు భానుప్రకాష్, కృష్ణమూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.