
నియంతృత్వం వైపుగా దేశం!
భారతదేశం నియంతృత్వం వైపుగా కదులుతోందని, సర్వాధికారం తమ గుప్పెట్లో పెట్టుకునే దిశగా కేంద్రం పావులు కదుపుతున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పాలకుల బండారం బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే పార్లమెంట్ వేదికగా నలుపు చట్టాలను ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. ఇది వరకు తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడటం జరిగిందో, దానిని తలదన్నే రీతిలో పోరాటాలు తాజాగా జరుగుతాయన్నారు.
సాక్షి, చైన్నె: తేనాం పేటలోని అన్నా అరివాలయంలోని కలైంజ్ఞర్ అరంగంలో మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ రాసిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ నేత ఖాదర్ మొహిద్దీన్, న్యాయ రంగానికి చెందిన సుబేర్ ఖాన్, రియాజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ పుస్తకాలను సీఎం స్టాలిన్ ఆవిష్కరణగా, ఖాదర్ మొహిద్దీన్ అందుకున్నారు. రెహ్మాన్‌ఖాన్ జీవితం, సేవలు, అనుబంధాన్ని గుర్తుచేస్తూ సీఎం ఈసందర్భంగా ప్రసంగించారు. సోదరుడు రెహ్మాన్ ఖాన్ ఇంటిపై ఒకటి కాదు, రెండు సార్లు దాడి జరిగిందని, అయినా, ఏ మాత్రం ఆయన తగ్గకుండా ముందడుగు వేశారని గుర్తు చేశారు. బుధవారం పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలను ఈసందర్భంగా వివరిస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు.
కక్ష పూరితంగానే బిల్లు
దేశం నియంతృత్వం వైపుగా కదులుతోందన్నారు. తమను వ్యతిరేకించే వారిని నిఘా సంస్థలను, స్వతంత్ర సంస్థలను ఉపయోగించి అణగొక్కే ప్రయత్నాలు చేస్తూ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా మరో నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని మండి పడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, వక్ఫ్ సవరణ చట్టం అంటూ మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఇది వరకు కొన్ని చట్టాలను తీసుకొచ్చారని వివరించారు. ఈ చట్టాలు ఆ వర్గాల ప్రజలను తీవ్ర ఆందోళనకు నెట్టే పరిస్థితికి తెచ్చాయని మండి పడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పెద్ద చర్చే సాగుతోందని పేర్కొంటూ, వాటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు మరో నల్ల చట్టంను అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారన్నారు. కక్ష పూరితంగానే ఈ బిల్లును రూపకల్పన చేశారని ధ్వజమెత్తారు. దేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునే విధంగా సర్వాధికార పాలన సాగించే కుట్రలు విస్తృతం చేసినట్టున్నారన్న తాజా పరిణామాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. నేరాలు నిరూపితం కాక ముందే, ఆరోపణల సాకుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రభుత్వాలను కుప్ప కూల్చేందుకు కుట్ర పూరితంగా కేంద్రం బిల్లును ప్రవేశ పెట్టిందని మండిపడ్డారు. ఇది వరకటి నల్ల బిల్లులకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగాయో , వాటిని తలదన్నే రీతిలో ఈ వ్యవహారంలోనూ పోరాటాలు జరుగుతాయని స్పష్టం చేశారు. డీఎంకే ఎల్లప్పుడు మైనారిటీలకు మద్దతుగానే ఉంటుందని, ఇందులో మార్పు ఉండదన్నారు. ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలలో చారిత్రాత్మక ఘటనల గురించి వివరించి ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి తమిళుడు చదవాల్సిన పుస్తకంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే విధంగా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాట బంద్ నిర్వహణకు సీఎం స్టాలిన్ పిలుపు నివ్వాలని, అన్ని దుకాణాలను మూసి వేసి నిరసన తెలియజేద్దామని వీసీకే నేత తిరుమావళవన్ మీడియా సమావేశంలో సీఎంకు విన్నవించారు.