
నేడు తిరునల్వేలికి అమిత్ షా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి వేదికగా బూత్ కమిటీ మహానాడుకు కమలనాథులు సన్నద్ధమయ్యారు. శుక్రవారం జరిగే ఈ మహానాడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తచ్చనల్లూరు వరకు రోడ్ షోకు ఏర్పాట్లు జరిగాయి. అమిత్‌షా రాకతో నిఘా వలయంలోకి తిరునల్వేలిని తీసుకొచ్చారు. వివరాలు.. తమిళనాడులో పాగా వేయడమే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏడాదిలో నెలకు ఒక పర్యాయం అమిత్ షా తమిళనాడుకు వచ్చి వెళ్లారు. మే నెలలో మాత్రం విరామం ఇచ్చినా జూన్ నెల మదురైలో రెండురోజులు తిష్ట వేశారు. జూలైలో పర్యటనకు ఏర్పాట్లు జరిగినా చివరి క్షణంలో వాయిదా పడింది. తాజాగా ఆగస్టు పర్యటనకు రెడీ అయ్యారు. తమిళనాడులో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమిలో 50 సీట్లను బీజేపీగురి పెట్టినట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నియోజక వర్గాలలోని బూత్ కమిటీలో మహానాడుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరునల్వేలి వేదికగా తొలి మహానాడు శుక్రవారం జరగనుంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, రామరనాధపురం, విరుదునగర్ జిల్లాలోని బూత్ కమిటీలతో మాట్లాడేందుకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.
సర్వం సిద్ధం
తచ్చనల్లూరు వద్ద మహానాడు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీల ప్రతినిధులు, ముఖ్య నేతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ మహానాడు నిమిత్తం అమిత్ షా కేరళలో జరిగే కార్యక్రమాలను ముగించుకుని తిరునల్వేలికి శుక్రవారం మధ్యాహ్నం రానున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కొచ్చిన్ నుంచి బయలు దేరి 2.50 గంటలకు తూత్తుకుడి విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడి నుంచి 3.10 గంటలకు హెలికాఫ్టర్‌లో తిరునల్వేలి సాయుధ బలగాల విభాగం పరేడ్ గ్రౌండ్ హెలిపాడ్‌కు హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్ షోజరగనున్నది. 4 గంటలకు తచ్చనల్లూరు వేదికకు చేరుకుని అమిత్ షా ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే తొలి మహానాడు కావడంతో కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా సర్వం సిద్ధం చేశారు. అమిత్ షా రాకతో తిరునల్వేలిని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు.