
అల్పాహార పథకం మరింత విస్తరణ
సాక్షి, చైన్నె: బడులలో సీఎం అల్పాహార పథకం మరింత విస్తరణకు చర్యలు చేపట్టారు. అదనంగా 3.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరే విధంగా ఈ విస్తరణ కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదిన చైన్నె మైలాపూర్‌లో సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులలో అధిక శాతం మంది ఉదయం వేళల్లో అల్పాహారం తీసుకోవడం లేదన్న విషయం గతంలో ప్రభుత్వం దృష్టికి చేరింది. ఓ పరిశీలనలో వెలుగు చూసిన ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ బడుల్లో ఉదయం వేళల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. 2022 సెప్టెంబరులో తొలి విడతగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 1,541 ప్రభుత్వ పాఠశాల్లో ఈ పథకం అమల్లోకి తెచ్చారు. దశల వారీగా ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకం ప్రస్తుతం దిగ్విజయవంతంగా అమల్లో ఉంది. 30,992 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18.50 లక్షల మంది పిల్లలు ఈ అల్పాహారం స్వీకరిస్తున్నారు. రోజుకో మెనూతో అల్పాహారం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ సహకారంతో నడిచే ఎయిడెడ్ పాఠశాలలోనూ అమలు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,995 ప్రభుత్వ సహాయంతో కూడిన ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 2,23,536 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇటీవల చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలో గొప్ప పథకంగా అల్పాహార పథకం మరింత దిగ్విజయవంతంగా అమలు చేస్తామని సీఎం స్టాలిన్ ఇది వరకే ప్రకటించారు. ఈ మేరకు తాజాగా మరో 3.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా పథకం విస్తరణకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా మీతో స్టాలిన్ శిబిరాలకు వస్తున్న విజ్ఞప్తుల మేరకు కలైంజ్ఞర్‌మగళిర్ ఉరిమై తిట్టం (మహిళా హక్కు పథకం) మేరకు రూ. 1000 నగదు పంపిణిని మరో 15 లక్షల మందికి వర్తింప చేయడానికి నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.