
చైన్నెలో తగ్గిన చేపల ధరలు
తిరువొత్తియూరు: కేరళ నుంచి చేపలు పెద్దఎత్తున విక్రయానికి వస్తుండడంతో చైన్నెలో చేపల ధరలు తగ్గాయి. ఫలితంగా తాము నష్టపోతున్నట్లు కాశిమేడు మత్స్యకారులు వాపోతున్నారు. పైగా తమిళనాడు తీరప్రాంతాల్లో చేపలు దొరకకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత కూడా ఫైబర్ పడవల లో వెళ్లిన మత్స్యకారులకు వలలో చేపలు పడటం లేదు. ఇక లోతైన సముద్రంలో చేపలు దొరకకపోవడంతో మత్స్యకారులు నిరాశతో తిరిగి వచ్చి నష్టపోతున్నారు. అదే సమయంలో కేరళ నుండి అధిక సంఖ్యలో చేపలు చైన్నెకి అమ్మకానికి వస్తున్నాయి. పుళల్, వానగరం ప్రాంతాలకు రోజూ కేరళ నుంచి పెద్దఎత్తున వంజిరం, వవ్వాల్, శంకర, రొయ్యలు వంటి చేపలు అధికంగా విక్రయానికి రావడంతో కాశిమేడు మత్స్యకారుల వ్యాపారం దెబ్బతింది. కేరళ నుం వస్తున్న వంజిరం చేపలు కిలో రూ.600, రూ.700లకు లభిస్తున్నాయి. దీనివల్ల రూ.1000 వరకు అమ్ముడైన ఈ చేపల ధర తగ్గింది. రొయ్యలు కిలో రూ.500కి లభిస్తున్నాయి. అలాగే 20 కిలోల కడంబ ధర రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముడవుతోంది. ఇక చేపల లభ్యత గురించి కాశిమేడు మొత్తం చేపల వ్యాపారి పొన్నన్ మాట్లాడుతూ లోతైన సముద్రంలో చేపలు దొరకకపోవడంతో మత్స్యకారులు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. దీనివల్ల నష్టం జరుగుతోంది. 800 ఫైబర్ పడవలో వెళ్లాల్సి ఉండగా..400 ఫైబర్ పడవలు మాత్రమే సముద్రంలోకి వెళ్లినట్లు వెల్లడించారు.