
కుశస్థలి నదిలో కట్టకు అడ్డుగోడ
తిరుత్తణి: కుశస్థలి నదిలో రూ.కోటి వ్యయంతో కట్టకు అడ్డుగోడ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. తిరువలంగాడు సమీపంలో ఎన్‌ఎన్.కండ్రిగ వద్ద కుశస్థలి నదిలో గత ఏడాది వరద ప్రవాహానికి నది కట్ట దెబ్బతింది. వరద ప్రవాహం నదితీర ప్రాంతంలోని పంట పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వుంది. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో నదికట్టను దృఢపరిచి అడ్డుగోడ నిర్మాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ. కోటి వ్యయంతో నది కట్టకు అడ్డుగోడ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని నదికి అడ్డుగోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో వరద పోటెత్తిన నది కట్టకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరద ప్రవాహం వెళుతుందని ప్రజా పనుల శాఖ అధికారులు తెలిపారు. ప్రజాపనులశాఖ అధికారులు, మండల డీఎంకే కన్వీనర్ విజయకుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా తాళవేడులో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.7లక్షలతో బస్‌షెల్టర్ నిర్మాణ పనులను ప్రారంభించారు.