
వైభవం.. స్తంభ ప్రతిష్ట
కొరుక్కుపేట: శరన్నవరాత్రి మహోత్సవం, వడాయతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం స్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైన్నెలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వడాయతి ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ ఉత్సవాలకు అంకురార్పణగా ఆలయ ప్రధాన అర్చకుల బృందం శాస్త్రోక్తంగా స్తంభ ప్రతిష్ట చేశారు. ముందుగా కన్యకా పరమేశ్వరి మూల, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం దేవస్థాన మహామండపంలో కలశ పూజను భక్తిశ్రద్ధలతో చేశారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్, పాలకమండలి సభ్యులు ఊటుకూరు శరత్‌కుమార్, ఎస్ ఎల్ సుదర్శనం, సీఆర్ కిషోర్‌బాబు, తాతా బద్రీనాథ్, ఎస్‌కేపీడీ చారిటీస్ కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ పాల్గొన్నారు.