విజయ్‌ సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ సన్నద్ధం

Aug 21 2025 7:04 AM | Updated on Aug 21 2025 7:04 AM

విజయ్

విజయ్‌ సన్నద్ధం

నేడు మదురైలో టీవీకే పండుగ

2 లక్షల మంది కూర్చునేందుకు భారీ ఏర్పాట్లు

గత అనుభవాల దృష్ట్యా, మరిన్ని జాగ్రత్తలు

జెండా స్థూపం కుప్పకూలడంతో అపశ్రుతి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మహానాడుకు

సాక్షి, చైన్నె : ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌, కర్మ యోగి కామరాజర్‌, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, వీర నారీ వేలు నాచ్చియార్‌, స్వాతంత్య్ర సమర యోధురాలు అంజలై అమ్మాల్‌ సిద్ధాంతాల ఆదర్శంగా తమిళగ వెట్రి కళగం వేదికగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్‌ గత ఏడాది అక్టోబరులో తొలి మహానాడును జయప్రదం చేసుకున్నారు. ఈ మహానాడు వేదికగా తానేమిటో, తన సిద్ధాంతాలు ఏమిటో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ తదుపరి పార్టీ పరంగా రూపు రేఖల నిర్మాణంపై దృష్టి పెట్టారు. 120 జిల్లాలను పార్టీ పరంగా ఏర్పాటు చేసి నిర్వాహకులను నియమించారు. 68 వేల పోలింగ్‌ బూత్‌లకు కమిటీలను నియమించారు. పార్టీ పరంగా సుమారు రెండంకెల మేరకు అనుబంధ విభాగాలను ప్రకటించి కార్యక్రమాలను విస్తృతం చేశారు. అలాగే, తన చివరి చిత్రం జననాయగం షూటింగ్‌ను ముగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో తనకు డీఎంకే, బీజేపీ కూటమి టార్గెట్‌గా తరచూ జరిగే కార్యక్రమాలలో విజయ్‌ విమర్శలు, ఆరోపణలు ఎక్కుబెడుతూ వచ్చారు. తమిళగ వెట్రి కళగం తమిళనాడుకు ప్రత్యామ్నాయం కాదని, అసలైన శక్తి అని చాటుకుంటూ వచ్చారు. ఇక, ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉండటంతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.

నేడు సమర శంఖం

ప్రజా క్షేత్రంలోకి దూసుకెళ్లడమే కాదు, తానేమిటో, తన బలం, యువ సమూహం, నవతరం ఓటరు తన వెన్నంటి ఏ మేరకు ఉన్నారో చాటు కునేందుకు పార్టీ పరంగా రెండవ మహానాడుకు సిద్ధమయ్యారు. ఈనెల 25వ తేదీ మహానాడుకు తేదీ ఖరారు చేసినా, చివరకు పోలీసు ఆంక్షలు, సూచనలతో నాలుగు రోజులు ముందుగానే గురువారం నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇందు కోసం మదురై శివారులోని పరపత్తి గ్రామం వద్ద 506 ఎకరాలలో సచివాలయం ఆకారంలో బ్రహ్మాండ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. 200 అడుగుల దూరం మేరకు విజయ్‌ నడిచి వచ్చి అభిమానులను పలకరించేందుకు ప్రత్యేక ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. గత మహానాడులో ఎదురైన సమస్యలు, పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించారు. ఆహారం, వాటర్‌, సరఫరా, తదితర అన్ని రకాల ఏర్పాట్ల మీద దృష్టి పెట్టే విధంగా ఒక్కో అంశానికి ఒక కమిటీ చొప్పున మొత్తం 20కమిటీలకు అభిమానుల సేవలో నిమగ్నమయ్యాయి. మహానాడు పరిసరాలలో 100 చోట్ల నిఘా నేత్రాలను సైతం ఏర్పాట్లు చేశారు. అలాగే పదుల సంఖ్యలో భారీ జనరేటర్లను సిద్ధం చేసి ఉంచారు. రెండు లక్షల మంది కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కుర్చీల సరఫరా కాంట్రాక్టరుల చివరి క్షణంలో చేతులు ఎత్తేయడంతో ఆగమేఘాలపై కేరళ నుంచి కుర్చీలను తెప్పించడం విశేషం. మహానాడు ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ సైతం ఏర్పాటు చేశారు.

జనాన్ని కట్టడి చేసేందుకు చర్యలు

విల్లుపురం జిల్లా విక్రవాండి వీ సాలై గ్రామంలో జరిగిన మహానాడులో జనం ఊహించని రీతిలో తరలి రావడంతో నిర్వహకులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా, అన్ని టోల్‌ గేట్ల మీద దృష్టి పెట్టారు. ఏ మేరకు మదురైకు వాహనాలు బయలుదేరి వెళ్తున్నాయో అన్న సమాచారం, జనం ఏ మేరకు తరలి వస్తున్నారో అన్న వివరాలను ఎప్పటికప్పుడు కంట్రోల్‌ రూమ్‌కు చేర వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగని రీతిలో మహానాడు జయప్రదానికి సిద్ధమయ్యారు. ఈ మహానాడు నిమిత్తం తమిళగ వెట్రి కళగం ముఖ్య నేతలు, విజయ్‌ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్‌, శోభాలతో పాటుగా సన్నిహితులు బుధవారమే మదురైకు వచ్చేశారు. విజయ్‌ ఈ మహానాడు వేదికగా కీలక ప్రకటనలు చేయబోతున్నట్టు సమాచారం వెలువడింది. ప్రజలకు వాగ్దానాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారాలు రావడంతో అందరి దృష్టి విజయ్‌ ప్రసంగం వైపుగా మరలింది. విజయ్‌ సైతం ముందుగానే వేదిక వద్దకు చేరుకుని అర్ధరాత్రి వేళ ఏర్పాట్లను పరిశీలించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మూడున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మహానాడు కార్యక్రమాలు జరగబోతున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో విజయ్‌ ప్రసగించనున్నారు. ఎనిమిదిన్నరలోపు కార్యక్రమాలను ముగించి అభిమానులు , జనం సురక్షితంగా వారి వారి ఊర్లకు వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకుని ఉన్నారు. కేడర్‌కు సేవలు అందించే కమిటీలకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌తో టీషర్టులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ అందజేశారు. కాగా, ఈ సారి మహానాడు వేదిక పరిసరాలలో పంచమూర్తుల ఫ్లెక్సీలతో పాటూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్‌ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ల ఆశీస్సులు విజయ్‌కు ఉన్నట్టుగా ఈ ఫెక్సీలు ఏర్పాటు కావడం విశేషం. అయితే, ఎంజీఆర్‌ అన్నాడీఎంకేకు మాత్రమే సొంతం అని, ఆయన ఫొటోతో ఫ్లెక్సీని వాడటం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ విమర్శించారు.

అపశ్రుతి

మహానాడు ఏర్పాట్లలో బుధవారం మధ్యాహ్నం అపశ్రుతి చోటు చేసుకుంది. వంద అడుగులతో జెండా స్తూపం సిద్ధం చేశారు. దీనిని క్రేన్‌ సాయంతో నిలబెట్టే ప్రయత్నం చేసే సమయంలో బెల్టు ఊడింది. ఈ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ జెండా స్తూపం ఓ కారు మీద పడటంతో అది నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనతో ఆ పరిసరాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ప్రత్యామ్నాయంగా జెండా స్తూపం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. మహానాడుకు తరలి వచ్చే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, సైనికుల వలే క్రమ శిక్షణతో మెలగాలని విజయ్‌ కోరారు. వృద్ధులు, గర్భిణిలు, చంటి బిడ్డల తల్లుల దయ చేసి మహానాడుకు రావద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా మహానాడు కోసం విరుదుగనర్‌ జిల్లా రాజపాళయం సమీపంలోని శ్రీవిళ్లిపుత్తూరు కరసల్‌కుడిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం ఏర్పడటంతో కాళీశ్వరన్‌ అనే విద్యార్థి మరణించాడు.

విజయ్‌ సన్నద్ధం1
1/2

విజయ్‌ సన్నద్ధం

విజయ్‌ సన్నద్ధం2
2/2

విజయ్‌ సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement