
సేవా కార్యక్రమాల్లో స్టాలిన్ దంపతులు
సాక్షి,చైన్నె : సీఎం స్టాలిన్ జీవిత భాగస్వామిగా దుర్గా అడుగు పెట్టి బుధవారంతో 50 సంవత్సరాలైంది. 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దంపతులు సేవా కార్యక్రమాలో మునిగారు. ఉదయాన్నే మెరీనా తీరంలోని దివంగత నేతలు అన్నా, కరుణానిధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి గోపాలపురం ఇంటికి వెళ్లారు. తండ్రి కరుణానిధి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న తల్లి దయాళు అమ్మాల్‌ను కలిసి స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. మధ్యాహ్నం సిరుమలర్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ ది విజువల్లీ అండ్‌హియరింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి బాల బాలికలతో కాసేపు మాట్లాడారు. వారికి కావాల్సిన సహకారం అందించారు. పిల్లలకు తమచేతులతో బిర్యాని వడ్డించారు. స్వీట్లు, కేకులను అందజేశారు. కాగా, తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అర్ధ శతాబ్దం పాటూ నా జీవిత భాగస్వామి ప్రయాణం అంటూ, నాలో దుర్గా సగం అని వ్యాఖ్యానించారు. తన ప్రేమతో సంతృప్తికరమైన జీవితాన్ని సాగించామని, ఆమె అపరిమిత ప్రేమకు కృతజ్ఞడను అని పేర్కొన్నారు. షరతులు లేని ప్రేమ, సర్దుకెళ్లే తత్వం ఈ తరం యువత జీవితాన్ని మెరుగు పరుస్తుందని ఈసందర్భంగా పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఇంటిని, దేశాన్ని గౌరవించే జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తల్లిదండ్రుల ఆశీస్సులను అందుకున్నారు. వారి ప్రేమానురాగాలను గుర్తుచేస్తూ సామాజికమాధ్యమంలో పోస్టు చేశారు. ఇక, మంత్రులు నెహ్రూ, ఎం. సుబ్రమణియన్, రఘుపతి, శివశంకర్, శేఖర్‌బాబు, పెరియస్వామి, ముత్తుస్వామిలతో పాటూ పలువురు సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, డీఎంకే కూటమి పార్టీలకు చెందిన కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత షణ్ముగం, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, ఎండీఎంకే నేత వైగో, మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్, మనిద నేయమక్కల్ కట్చి నేత జవహిరుల్లా, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి నేత ఈశ్వరన్‌లు సీఎం స్టాలిన్, దంపతులను క్యాంప్ కార్యాలయంలో నేరుగా కలిసి సత్కరించారు. ఇద్దరికి పూల మాలలు వేయించారు. కానుక సమర్పించారు.

సేవా కార్యక్రమాల్లో స్టాలిన్ దంపతులు

సేవా కార్యక్రమాల్లో స్టాలిన్ దంపతులు