ఎన్‌ఐఏ వేట | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ వేట

Aug 21 2025 7:04 AM | Updated on Aug 21 2025 7:04 AM

ఎన్‌ఐఏ వేట

ఎన్‌ఐఏ వేట

దిండుగల్‌, తెన్‌కాశిలో సోదాలు

సాక్షి, చైన్నె : దిండుగల్‌ జిల్లాలో ఎనిమిది చోట్ల బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారుల బృందం తీవ్ర సోదాలో నిమగ్నమైంది. రాష్ట్రంలో తరచూ ఎన్‌ఐఏ సోదాలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. హిందూ మున్నని నేత రామలింగం హత్య కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయాన్నే ఎన్‌ఐఏ అధికారులు దిండుగల్‌ జిల్లాలోని దిండుగల్‌ పట్టణం, ఒట్టన్‌చత్రం, కొడైకెనాల్‌తోపాటుగా ఎనిమిది చోట్ల పలువుర్ని గురి పెట్టి వేటలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. దిండుగల్‌లోనే ఎన్‌ఐఏ అధికారులు తిష్ట వేసి ఉన్నారు. ఇందులో దిండుగల్‌కు చరెందిన మహ్మద్‌, వత్తగుండుకు చెందిన ఖాదర్‌లతో పాటూ 8 మందికి సమన్లు జారీ చేశారు. వీరంతా ఈనెల 25న చైన్నెలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే తెన్‌కాశి జిల్లా తెన్‌కాశితో పాటూ ఆ పరిసరాలలోని అబ్దుల్‌ ఖాదర్‌, మహ్మద్‌ అలీ అనే ఇద్దరు ఇళ్లలో మూడు గంటల పాటూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, సోదాలకు వ్యతిరేకంగా కొన్ని మైనారిటీ సంఘాలు ఆందోళనకు పలు చోట్ల దిగాయి. దీంతో పోలీసు భద్రత నడుమ ఎన్‌ఐఏ సోదాలు జరిగాయి.

రద్దుకు కోర్టు నిరాకరణ

సాక్షి, చైన్నె: రాయపురం, తిరువీకానగర్‌ మండలాలలో ప్రైవేటుకు పారిశుద్ద్య పనులు అప్పగించడాన్ని తాము రద్దు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. జీతం విషయంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. గ్రేటర్‌ చైన్నె పరిధిలోని రాయపురం, తిరువీకానగర్‌ మండలాలకు చెందిన పారిశుధ్య కార్మికులు రెండు వారాల పాటూ రిప్పన్‌ బిల్డింగ్‌ ఆవరణలో నిరసన దీక్ష కొనసాగించిన విషయం తెలిసిందే. అధికారులు, మంత్రులు పలు దఫాలుగా చర్చించినా కార్మికులు తగ్గ లేదు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వీరు నిరసన దీక్ష సాగించడంతో ట్రాఫిక్‌ సమస్య తప్పలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో నిరసన కారులను అక్కడి నుంచి తరలించారు. అర్ధరాత్రి వేళ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో రాయపురం, తిరువీకానగర్‌ మండలాలలో పారిశుధ్య పనులు ప్రైవేటుకు అప్పగిస్తూ గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చింది. కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము రద్దు చేయలేమని కోర్టు స్పష్టంచేసింది. అలాగే గత నెల ఇచ్చినట్టుగానే జీతం ఇవ్వాలని సూచిస్తూ, ఇతర జీతాల విషయంగా కార్పొరేషన్‌, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.

చైన్నెకి మరో 125 ఎలక్ట్రిక్‌ బస్సులు

సబర్బన్‌ ప్రాంతాల్లో అందుబాటులోకి..

కొరుక్కుపేట: పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి చైన్నెలో ప్రజా రవాణాను ఆధునీకరిస్తున్నారు. మున్సిపల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ డీజిల్‌ బస్సులను నడుపుతుండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బస్సు సేవలను క్రమంగా ప్రవేశపెడుతున్నారు. 625 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని నిర్ణయించారు. ప్రారంభంలో, వ్యాసర్పాడి నుంచి 125 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉత్తర చైన్నె ప్రధాన కేంద్రంగా నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ డీలక్స్‌ కేటగిరీకి చెందినవి. ఈ నేపథ్యంలో పూందమల్లి వర్క్‌షాప్‌లో వచ్చే నెల నుంచి మరో 125 బస్సులు నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి నడపడానికి ఏసీ, డీలక్స్‌ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. బ్యాటరీ రీఛార్జింగ్‌ సౌకర్యాలు, సర్వీస్‌ సౌకర్యాలు, సిబ్బంది విశ్రాంతి గదులు కల్పిస్తున్నారు . ఇదిలా ఉండగా ఎయిర్‌ పోర్టు నుంచి సిరుచ్చేరి ఏసీ బస్సులను ప్రారంభించటం విశేషం .

పూందమల్లి – మదుర వాయిల్‌ మధ్య సిక్స్‌ వే

సాక్షి, చైన్నె : పూందమల్లి – మదుర వాయిల్‌ మధ్య ఆరు లైన్లతో ఎక్స్‌ప్రెస్‌ వే ఏర్పాటుకు జాతీయ రహదారుల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు కేటాయించారు. చైన్నె నగరంలోకి ప్రవేశించే వాహనాలతోపూందమల్లి పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. ఈ దృష్ట్యా, 8.1 కి.మీ దూరం మదుర వాయిల్‌ వరకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ వేను సిక్స్‌వేగా ఏర్పాటు చేయడానికి చర్యలుతీసుకున్నారు. బెంగళూరు నుంచి వేలూరు, కాంచీపురం మీదుగా చైన్నె లోకి వచ్చే వాహనాలు, ఆంధ్ర నుంచి తిరువళ్లూరు మీదుగా వచ్చే వాహనాల రవాణాకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా ఈ వే నిర్మాణం జరగనుంది. కాగా, ఇప్పటికే మదుర వాయిల్‌ బైపాస్‌ వరకు చైన్నె హార్బర్‌ నుంచి డబుల్‌ డెక్కర్‌ వంతెన మార్గం పనులకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement