
ఈడీకి మళ్లీ అక్షింతలు
సాక్షి, చైన్నె: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు హైకోర్టు బుధవారం మళ్లీ అంక్షింతలు తప్పలేదు. ఈ సారి విచారణకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తులు ఆదేశించారు. టాస్మాక్‌లో రూ. 1000 కోట్ల అక్రమాల పేరిట ఈడీ సృష్టించిన సోదాలు, దాడుల గురించి తెలిసిందే. నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపార వేత్త విక్రమ్ రవీంద్రలు ఈ సోదాలకు వ్యతిరేకంగా, ఈడీ చర్యలకు చెక్ పెట్టే విధంగా మద్రాసు హైకోర్టు ఆశ్రయించారు. తమ కార్యాలయాలను సీజ్ చేయడం, తదితర అంశాలను కోర్టు ముందు ఉంచారు. ఈ పిటిషన్ విచారణ వాడివేడిగానే సాగింది.ఈ సమయంలో పలు మార్లు ఈడికి కోర్టు అక్షింతలు వేసింది. టాస్మాక్ స్కాంతో వీరిద్దరికి ఉన్న సంబంధాలేమిటో అని ప్రశ్నించింది. ఆధారాలు ఏవీ అని కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈకేసు విచారణకు స్టే విధించారు. అయినా, ఈడీ తరపున ఆకాశ్ భాస్కరన్‌కు సమన్లు వెళ్లడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఆకాశ్ తరపు న్యాయవాది ఇటీవల కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు ధిక్కారం పరిధిలోకి ఈడీ చర్యలు రావడంతో అవసరం అయితే, పిటిషన్ దాఖలు చేయవచ్చు అని న్యాయమూర్తి సూచించారు. అదే సమయంలో సమన్లు పొరబాటుగా వెళ్లినట్టు ఈడీ పేర్కొనడంతో సంబంధిత అధికారులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆకాశ్, విక్రమ్‌కు ఈ స్కాంతో ఉన్న సంబంధం గురించి పలు ప్రశ్నలను కోర్టు సందించింది. ఇందుకు గత విచారణ సమయంలో ఈడీ తరపున సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఈడీ తరపున సమాధానాలు దాఖలుచేయక పోవడంతో తీవ్రంగా పరిగణించిన హైకోర్టు రూ. 30 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిధికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదావేశారు. బుధవారం మళ్లీ పిటిషన్ విచారణకు రాగా న్యాయమూర్తులు ఈడీ అధికారులకు తీవ్ర అక్షింతలు వేశారు. కోర్టు ధిక్కార వ్యవహారంలో ఎలాంటి సమాధానాలు అన్నది ఈడీ తరపున దాఖలు కాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశించారు.