
ఆభరణాల అలంకరణలో వివాదం
సాక్షి, చైన్నె: స్వామి వారికి ఆభరణాల అలంకరణలో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. దీంతో రెండు గంటల పాటూ ఆలయంలో దర్శన సేవలు ఆగాయి. దీంతో భక్తులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆరుపడై వీడుల్లో రెండోదిగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో సముద్ర తీరం ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఏటా స్కంద షష్ఠి అత్యంత వేడుకగా జరుగుతుంది. అలాగే ఆవని బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహించడం ఆనవాయితీ. నిత్యం భక్తులతో పోటెత్తే ఈ ఆలయంలో ఆవని మాస బ్రహ్మోత్సవాలకు గత వారం రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. పెద్దఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి వారికి బంగారు ఆభరణాలను సమర్పించి అలంకరించే విషయంగా శివాచార్యులు, త్రిసుదందిరంగల్ మధ్య వివాదం రేగింది. ఈ అలంకరణ వివాదం రచ్చకెక్కడంతో పరస్పరం కయ్యానికి కాలుదువ్వారు. దీంతో ఆలయంలో స్వామి వారి దర్శన సేవలు ఆగాయి. ఆలయం ఆవరణలో ఇరు వర్గాలు వేర్వేగారు భీష్మించుకుని కూర్చోవడంతో ఉత్కంఠ నెలకొంది. భక్తులుకిలో మీటర్ల కొద్ది బారులు తీరాల్సి వచ్చింది. చివరకు దేవాదాయ శాఖ, జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. రెండు గంటల అనంతర భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయంలో శివాచార్యులు, త్రిసుదందిరంగల్ మధ్య వివాదాన్ని పలువురు తీవ్రంగా విమర్శించే పనిలో పడ్డారు.