
ముగిసిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్ కోర్సులకు మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. లక్షా 45 వేల 481 మంది విద్యార్థులు తమకు కావాల్సిన సీట్లను వివిధ కళాశాలలో ఎంపిక చేసుకున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటుగా అనుబంధ కౌన్సిలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ముగించి గత నెల మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. తొలుత రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీ చేశారు. జూలై 14 నుంచి మూడు విడతలుగా జనరల్ కౌన్సెలింగ్ జరుగుతూ వచ్చింది. ప్రభుత్వ కోటాలో సుమారు రెండు లక్షల సీట్లు ఉండగా 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్‌కు 2 లక్షల 41 వేల 641 మంది అర్హత సాధించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మొత్తం లక్షా 45 వేల 481 మంది విద్యార్థులకు తమకు కావాల్సిన కళాశాలలలో సీట్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరికి సీట్ల కే టాయింపునకు సంబంధించిన ప్రక్రియను బుధవారం ముగించారు. మొత్తం భర్తీ చేసిన సీట్లలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ మేరకు 14,143 మంది విద్యార్థులు సీట్లును దక్కించుకున్నారు. కాగా అనేక కళాశాలలో పూర్తి స్థాయిలో సీట్ల భర్తీ జరగలేదు. ప్రధాన కోర్సులు భర్తీ చేసినా, మరికొన్ని కోర్సుల్లో చేరే వారి సంఖ్య తక్కువే. అలాగే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మరెన్నో కళాశాలలో సీట్ల భర్తీ సగానికి సగం కూడా జరగక పోవడం గమనార్హం. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం అనుబంధ కౌన్సెలింగ్‌కు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.ఈ విద్యార్థులకు గురు, శుక్ర, శనివారాలలో అనుబంధ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 26వ తేదీ సోమవారం పూర్తిస్థాయిలో సీట్ల భర్తీ వివరాలతో పాటూ ఏఏ కళాశాలలో సీట్ల భర్తీ మరీ తక్కువగా జరిగిందో అన్న సమాచారాలు వెలువడనున్నాయి.