
అశోక్ సెల్వన్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాన్ని రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు మిలియన్ డాలర్ స్టూడియోస్, వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ ప్రస్తుతం నిర్మిస్తున్న హ్యాపీ ఎండింగ్, ఒన్స్ మోర్ చిత్రాలు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్ – 2, విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న ఆయన 54వ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ రెండు సంస్థలు కలిసి తాజాగా అశోక్ సెల్వన్ హీరోగా చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇందులో నిమిషా సజయన్ నాయకిగా నటిస్తున్నారు. మణికంఠన్ ఆనందన్ దర్శకత్వం అవహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు, దర్శకుడు శశికుమార్, దర్శకుడు ఆర్.శరవణన్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఇది అన్ని వర్గాలను అలరించే కమర్షియల్ అంశాలతో కూడిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. షూటింగ్‌ను ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, పుష్పరాజ్ సంతోష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.