
బ్లూమ్ సిండ్రోమ్ పిల్లలకు బీఎంటీతో శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: బ్లూమ్ సిండ్రోమ్ ఉన్న పిల్లలలో ఆరోగ్యపరంగా డాక్యుమెంట్ చేయబడ్డ టీసీఆర్ ఆల్పా బీటా డిప్లీటెడ్ హాప్లోయిడెన్టికల్ బోన్‌మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ప్రక్రియను విజయవంతం చేశామని ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ విభాగం హెడ్ ఎం. దీనదయాళన్ ప్రకటించారు. బుధవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రోమోజోమల్, మ్యారో సమస్యలతో బాధ పడుతున్న పిల్లలను బ్లూమ్ సిండ్రోమ్ చైల్డ్‌గా పిలవడం జరుగుతున్నట్టు వివరించారు. ఈ అరుదైన జన్యు పరమైన రుగ్మత ఉన్నట్టు నిర్ధారణ అయిన పక్షంలో రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు. ఈ బ్లూమ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యు రుగ్మతతో బాధపడుతూ వచ్చిన 12 సంవత్సరాల బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఆమె తమ్ముడి నుంచి ప్రాణాలను రక్షించే స్టెమ్ సెల్స్ ఉపయోగించామన్నారు. టీసీఆర్ ఆల్పా బీటా డిప్లీటెడ్ మాప్లోయిడెంటికల్ బోన్‌మ్యారో ట్రాన్స్ ప్లాంట్(బీఎంటీ) అని పిలవబడే సంక్లిష్ట ప్రక్రియను ఆధునిక విధానంతో తొలి సారిగా విజయవంతం చేశామన్నారు. బ్లూమ్ సిండ్రోమ్ ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తాయని, ఎముక మజ్జ వైఫల్యం కారణంగా ఈ మార్పిడి అవశ్యంగా మారిందన్నారు. స్టెమ్ సెల్ మార్పిడికి తగిన దాతను కొనుకొనగడం ముఖ్య సవాలుగా ఈ విధానంలో మారిందన్నారు. చివరకు ఆ బాలిక తమ్ముడి నుంచి తగినంత మోతాదులో స్టెమ్ సెల్‌ను సేకరించామని, బాలిక, ఆమె తమ్ముడికి సాధ్యమైన ఉత్తమమైన ఫలితాన్ని నిర్ధారించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి విజయం సాధించామన్నారు. ఈ సమావేశంలో పీడియాట్రిక్ హెమటాలజీ విభాగం డాక్టర్ విమల్‌కుమార్, రిషబ్ భరద్వాజ్ పాల్గొన్నారు.