
చెరువు కరకట్ట ధ్వంసం
తిరువళ్లూరు: చెరువు కరకట్టను ధ్వంసం చేసి మట్టి తరలించడాన్ని నిరసిస్తూ లారీలను అడ్డుకుని స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు తిరునిండ్రవూర్ నుంచి తిరుత్తణి వరకు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల కోసం జిల్లాలోని పట్రపెరంబదూరు, కారణి సహా పది ప్రాంతాల్లో మట్టి తరలించడానికి ప్రభుత్వం క్వారీలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అన్ని క్వారీల్లో మట్టి తరలింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరులోని క్వారీల్లో మట్టి తరలింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో చెరువు కరకట్టను ద్వంసం చేసి మట్టి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు లారీలను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించడంతో లారీలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలిసి తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళకారులకు మధ్య స్వల్పంగా వాగ్వా దం నెలకొంది. భారీ వర్షం కురిస్తే చెరువులోని నీరు వృథా కాకుండా రెండుగంటల్లో కరకట్టకు మరమ్మతు చేస్తామని క్వారీ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.