
పళనికి ఊరట
న్యూస్‌రీల్
సివిల్ కోర్టు విచారణపై హైకోర్టు స్టే
సాక్షి, చైన్నె : తన ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణ నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె పళణి స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. సిటీ సివిల్ కోర్టు విచారణకు తాత్కాలికంగా స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈకేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరపున రిట్‌పిటిషన్ దాఖలైంది. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్ ఇటీవల విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణి స్వామి వాదనను కోర్టు తిరస్కరించింది. పళణి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు న్యాయమూర్తి నిర్ణయించారు. సిటీ సీవిల్ కోర్టు నిర్ణయం అన్నాడీఎంకే వర్గాల్ని కలవరంలో పడేశాయి. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంగా విచారణను ఎదుర్కోవాల్సి రావడటంతో ఇది ఎన్ని మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూనే, మరో వైపు ప్రజా చైతన్య యాత్రలో పళణి స్వామి దూసుకెళ్తున్నారు. నాలుగో విడత పర్యటనకు సైతం సన్నద్దం అయ్యారు. ఈ న్యాయ పోరాటంలో భాగంగా హైకోర్టులో సివిల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పళణి స్వామి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణి స్వామికి ఊరట కలిగించే విధంగా సిటీ సివిల్ కోర్టు విచారణకు స్టే విధిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.
అన్బుమణికి నోటీసు
సాక్షి, చైన్నె : పీఎంకేలో సాగుతున్న వార్‌లో భాగంగా తనయుడు అన్బుమణికి తండ్రి రాందాసు నోటీసు పంపించారు. పార్టీ పరంగా ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తప్పదన్న చర్చ జోరందుకుంది. పీఎంకేలో తానంటే తాను అధ్యక్షుడ్ని అని రాందాసు, అన్బుమణి ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి నేతృత్వంలో వేర్వేరుగా సర్వ సభ్య సమావేశాలు నిర్వహించారు. ఇందులో 2026 ఆగస్టు వరకు తానే అధ్యక్షుడ్ని అని, తనతోపాటూ నిర్వాహకులు కొనసాగుతారని అన్బుమణి ప్రకటించుకున్నారు. అదే సమయంలో పీఎంకేలో సర్వాధికారాలు తనకు మాత్రమే ఉన్నాయని, పార్టీ చట్ట ప్రకారం సవరణలతో తానే వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని రాందాసు స్పష్టం చేశారు. అదే సమయంలో రాందాసు నేతృత్వంలో జరిగిన సర్వ సభ్యం భేటీలో వ్యూహాత్మకంగా క్రమ శిక్షణ కమిటీకి అన్బుమణి చర్యలను పంపించారు. ఆయన తీరును కమిటీ పరిశీలించి, నోటీసులు జారీకి నిర్ణయించింది. దీంతో అన్భుమణి ముందు 16 ఆరోపణలు ఉంచారు. ఈనెల 31వ తేదీ నాటికి సమాధానం ఇవ్వాలని పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడైన రాందాసు అన్బమణికి హుకుం జారీ చేశారు. ఈ నోటీసులకు అన్బుమణి సరిగ్గా స్పందించేనా అన్న చర్చ ఊపందుకుంది. ఈ దృష్ట్యా, పీఎంకే లో అన్బుమణిపై క్రమ శిక్షణ చర్య తప్పదన్న చర్చ జోరందుకుంది.
రూ. 2.3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో మంగళవారం దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా తరలించిన రూ.2.3 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురు ప్రయాణికులు, విమానాశ్రయ కాంట్రాక్ట్ ఉద్యోగిని మరో విమానంలో శ్రీలంకకు పారిపోవడానికి యత్నించిన వారిని కస్టమ్స్ విభాగం ఆకస్మికంగా అరెస్టు చేసింది. ఈ ఘటన విమానాశ్రయ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.